జీఎస్టీ వల్ల వచ్చిన ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవడంలో భాగంగా జీఎస్టీ కౌన్సిల్ ఇచ్చిన ఆప్షన్లను వాడుకునేందుకు దాదాపు 21 రాష్ట్రాలు ముందుకొచ్చినట్టు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ఈ 21 రాష్ట్రాలలో చాలావరకూ బీజేపీ, దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నరాష్ట్రాలేనని పేర్కొన్నాయి.
ఆప్షన్-1 ప్రకారం రూ. 97 వేల కోట్ల నిధులను సమకూర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర, ఉత్తరఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ సిద్ధమైనట్టు వివరించాయి.
జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు తమ నిర్ణయాలను ఇంకా పంపలేదని వెల్లడించాయి. కాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమయ్యే అక్టోబర్ 5లోపు మిగిలిన రాష్ట్రాలు తమ ఆప్షన్‌లను పంపించకుంటే కేంద్రం ఇచ్చే జీఎస్టీ బకాయిల కోసం జూన్, 2022 వరకు వేచి చూడాల్సి ఉంటుందని ఆయా వర్గాలు తెలిపాయి.
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు రూ. 2.35 లక్షల కోట్ల ఆదాయ నష్టం వచ్చింది. దీంట్లో జీఎస్టీని అమలు చేయడం వల్ల రూ. 97 వేల కోట్ల నష్టం రాగా, మిగిలిన రూ. 1.38 లక్షల కోట్ల నష్టానికి కరోనా కారణమని కేంద్రం చెప్పింది. ఈ క్రమంలో జీఎస్టీ వల్ల వచ్చిన ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవడానికి జీఎస్టీ కౌన్సిల్ రాష్ట్రాలకు రెండు ఆప్షన్‌లను ఇచ్చింది.
ఆప్షన్-1ను ఎంచుకున్న రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణలో స్పెషల్ విండో ద్వారా ఇచ్చే రుణాలు (మొత్తం రూ. 97 వేల కోట్లు) తీసుకుంటాయి. ఆప్షన్-2 ఎంచుకున్న రాష్ట్రాలు బహిరంగ మార్కెట్లో అప్పులు (మొత్తం రూ. 2.35 లక్షల కోట్లు) తీసుకొని ఆదాయ నష్టాలను పూడ్చుకుంటాయి. రాష్ట్రాలకు జీఎస్టీ వల్ల వచ్చే నష్టాన్ని కేంద్రం పూడ్చాల్సి ఉండగా, కరోనా కారణంగా నిధులు లేవన్న కారణంతో అప్పులు తీసుకోవాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ