టిక్‌టాక్‌  నిషేధంపై ట్రంప్ వెనుకడుగు 

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ నిషేధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనుకడుగు వేశారు.  ప్రస్తుతానికి వారం పాటు నిషేధాన్ని అమెరికా వాణిజ్య శాఖ వాయిదా వేసింది. 
 
టిక్‌టాక్‌ యాప్‌ను కొనసాగించేందుకు అమెరికాకు చెందిన ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌ సంస్థలతో టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మూడు కంపెనీలు కలిసి టెక్సాస్‌ వేదికగా టిక్‌టాక్‌ గ్లోబల్‌ అనే సంస్థను స్థాపిస్తారు.
 
ఈ సంస్థలో రెండు అమెరికన్‌ కంపెనీలకు 53 శాతం వాటా ఉంటుంది. బైట్‌ డ్యాన్స్‌కు 36 శాతం వాటాలు ఉంటాయి. దీంతో ఈ కంపెనీలో మెజార్టీ వాటాలు అమెరికా కంపెనీల చేతిలో ఉంటాయి. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు కూడా ఎక్కువ మంది అమెరికన్లే ఉంటారు. 
 
కొత్తగా ఏర్పడే టిక్‌టాక్‌ గ్లోబల్‌ సంస్థలో అమెరికా వినియోగదారుల సమాచారాన్ని పూర్తిగా ఒరాకిలే నిర్వహిస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.అమెరికా విదేశీ పెట్టుడుల్ని పర్యవేక్షించే కమిటీ నుంచి అనుమతులు రాగానే టిక్‌టాక్‌ గ్లోబల్‌ కార్యకలాపాలు మొదలు పెడుతుందని ఆ ఉన్నతాధికారి తెలిపారు. 
 
ఈ కొత్త సంస్థ ఏర్పాటు పట్ల అధ్యక్షుడు ట్రంప్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంస్థ ద్వారా కొత్తగా 25 వేల ఉద్యోగాలు వస్తాయని, పౌరుల సమాచారానికి 100 శాతం భద్రత లభిస్తుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.