వివాదాస్పద మ్యాప్‌తో నేపాల్‌ కొత్త పాఠ్య పుస్తకాలు

భారత్‌తో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం కొత్త పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడుతూ, సవరించిన దేశ భౌగోళిక రాజకీయ మ్యాప్‌ను ఆ కొత్త పుస్తకాల్లో చేర్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన మూడు భారతదేశ ప్రాంతాలను నేపాల్‌ భూభాగంలో కలిపివేసినట్లుగా అందులో చూపించింది. 
 
భారతదేశానికి చెందిన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాదురా ఈ మూడు ప్రాంతాలను నేపాల్‌కు చెందినవిగా చూపిస్తున్న కొత్త రాజకీయ మ్యాప్‌ను నేపాల్‌ పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల భారత్‌ ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కృత్రిమ ఆక్రమణలను తాము సహించబోమని ఖండించింది. 
 
నేపాల్‌ విద్యా శాఖకు చెందిన కరిక్యులమ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఇటీవలనే సవరించిన మ్యాప్‌తో కూడిన పుస్తకాలను ప్రచురించిందని సమాచార శాఖ అధికారి గణేష్‌ భట్టారారు తెలిపారు. 9, 12 తరగతుల సిలబస్‌లో వీటిని చేర్చారు.