సగానికి పైగా  కరోనా అమెరికా,  భారత్‌, బ్రెజిల్‌లలోనే

ప్రపంచంలో కరోనా కరాళనృత్యం కొనసాగుతున్నది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వివరాల ప్రకారం గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్‌, బ్రెజిల్‌లోనే రికార్డయ్యాయి.

గడిచిన నెల రోజుల వ్యవధిలోనే కోటి కేసులు నమోదవ్వడం గమనార్హం. కేసులు, మరణాల్లో అమెరికా తొలి స్థానంలో ఉన్నది. ఆ దేశంలో 66,75,560 కేసులు నమోదుకాగా, 1,97,643 మంది మరణించారు. భారత్‌లో 52,14,677 కేసులు, 84,372 మరణాలు, బ్రెజిల్‌లో 44,55,386 కేసులు, 1,34,935 మరణాలు నమోదయ్యాయి.

వ‌చ్చేఏడాది ఏప్రిల్ నాటికి దేశంలోని ప్ర‌తిఒక్క‌రికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. కరోనా వ్యాక్సిన్‌కు అనుమ‌తులు రాగానే ప్రభుత్వం అమెరికన్లందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతుందని చెప్పారు. వ్యాక్సిన్ తయారు చేసేందుకు శాస్త్ర‌వేత్త‌లు నిరంతరం శ్రమిస్తున్నారని, మూడు వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని తెలిపారు. 

కాగా, తేలికపాటి లక్షణాలున్న కరోనా ఔట్‌ పేషెంట్లకు చికిత్స అందించేందుకు రష్యా ప్రభుత్వం తొలిసారిగా ఆర్‌ఫామ్‌ సంస్థకు చెందిన కరోనావిర్‌ ఔషధానికి అనుమతి ఇచ్చింది. ఇది మరో వారంలో ఆ దేశంలోని మెడికల్‌ షాపుల్లో విక్రయానికి అందుబాటులోకి రానుంది.

అంతకుముందు మేలో అవిఫవిర్‌ ఔషధానికి కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రెండింటినీ ఫావిపిరవిర్‌ ఆధారంగా అభివృద్ధి చేశారు. స్ఫూత్నిక్‌ వీ పేరిట రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ను తయారుచేసిన సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటికే వివిధ దేశాలు రష్యాతో ఒప్పందం చేసుకుంటున్నాయి.