కేసీఆర్ ను గద్దె దింపడమే అసలైన విమోచనం  

గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరిస్తూ తెలంగాణ అమరుల ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ను గద్దె దింపడమే తెలంగాణకు అసలైన విమోచనం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో నిజాం సంస్థానంలో భాగంగా ఉన్న జిల్లాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపుతుండగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫాం హౌస్ కే పరిమితం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 

ఏ ప్రాంత ప్రజలకైనా వారి స్వతంత్ర దినోత్సవాన్ని  జరుపుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీనిని కాదనడానికి ఈ ముఖ్యమంత్రి ఎవరని సంజయ్ ప్రశ్నించారు. అరాచక నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడం కోసం అమరులైన వేలాదిమంది తెలంగాణ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు. వారు చూపించిన తెగువ, ధైర్యసాహసాలు రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇస్తాయని తెలిపారు. 

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడం కేసీఆర్ కే దక్కిందని ధ్వజమెత్తారు. వచ్చే మూడేళ్లలోనైనా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, లేకపోతే 2023లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజలు గర్వపడేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్​జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పార్టీ సీనియర్ నేతలు ఇంద్రసేనారెడ్డి, మంత్రి శ్రీనివాసులు, బంగారు శృతి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.