చరిత్రను వక్రీకరించటం పెద్ద నేరం  

చరిత్రను మరచిపోవటమే మహా పాపమైతే…చరిత్రను వక్రీకరించటం అంతకంటే పెద్ద నేరమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు హెచ్చరించారు. మార్టియర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్  (ఎం ఎం ఆర్ ఐ) ప్రచురించిన “నిజాం Vs నిజం” పుస్తకాన్ని ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. 
 
ఎందరో సామాన్యుల రక్తతర్పణంతో తెలంగాణకు స్వాతంత్య్రం విదేశీ భావజాలంతో మనుగడ కొనసాగించే కొన్ని సంస్థలు గడచిన ఏడు దశాబ్ధాలుగా వాస్తవాలకు మసిబూసి మారేడడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నాయని విద్యాసాగర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నియంత నిజాంను ఆదర్శపాలకుడంటూ కొనియాడే అభినవ నిజాంలకు కనువిప్పు కలిగేలా యువతరానికి తెలంగణ రక్తచరిత్రను, నాటి అమరుల పోరాటపటిమ కళ్లకు కట్టేలా “నిజాం Vs నిజం” పుస్తకం యువతరానికి మార్గదర్శనం చేస్తుందని ఎం ఎం ఆర్ ఐ 
అధ్యక్షులు మురళీ మనోహర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
ఈ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన జాతీయవాదుల ఆశయ సాధన కోసమే తమ సంస్థ పరిశోధనలు చేస్తుందని ఆయన చెప్పారు. దానిలో భాగంగానే మన నిజమైన చరిత్రను భావితరాలకు అందించే ఇలాంటి పుస్తకాలు ప్రచురిస్తుందని ఆయన తెలిపారు. 
 
చరిత్రను ఎవరెంత వక్రీకరించే ప్రయత్నం చేసినా, తాము మాత్రం తెలంగాణకు నిరంకుశ నిజాం పీడ విరగడ అయిన సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవం గానే జరుపుకుంటామని మురళీమనోహర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత బొప్పా భాస్కర్, బీజేపీ సీనియర్ నాయకులు జి యోగానంద్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.