భారత్ కు 10 కోట్ల డోస్ ల రష్యా వ్యాక్సిన్ 

భారత్ కు 10 కోట్ల డోస్ ల రష్యా వ్యాక్సిన్ 

మూడో దశలో ఉన్న రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ప్రయోగాలు ఇప్పుడు భారత్‌లో కూడా జరపడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారత ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో రష్యా డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) ఒ ప్పందం కుదుర్చుకోవడంతో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. 

ఇంతేకాదు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను భారత్ లో సరఫరా చేయడానికి కూడా ఒప్పందం కుదిరింది. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రాగానే ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదేనని స్పష్టం చేస్తున్నాయని, అనుమతులు రాగానే డాక్టర్ రెడ్డీస్‌కు 10 కోట్ల డోస్‌లను అందించే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్‌డిఐఎఫ్ ప్రకటించింది.

ఈ సంవత్సరం చివరిలోనే వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, డాక్టర్ రెడ్డీస్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఆర్ డి ఐ ఓ సీఈఓ కిరిల్ డిమిత్రివ్ వెల్లడించారు. భారత్‌కు వ్యాక్సిన్ సరఫరా చేయడానికి ఆర్‌డిఐఎఫ్‌తో కలసి పనిచేయడం సంతోషంగా ఉందని డాక్టర్ రెడ్డీస్ కో ఛైర్మన్ జివి ప్రసాద్ వెల్లడించారు. 

తొలి, రెండు దశల ప్రయోగాల ఫలితాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని చెప్పారు. భారత్‌లో నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం మూడో దశ ప్రయోగాలు ఇక్కడ తాము చేపడతామని జిపి ప్రసాద్ తెలిపారు. 

గమలెయా నేషనల్ రీసెర్చి సెంటర్ ఆఫ్ ఎపిడెమియోలజీ, మైక్రోబయోలజీ, ఆర్‌డిఐఎఫ్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేశాయి. అదనంగా మరికొన్ని ట్రయల్స్ బ్రెజిల్, సౌదీ అరేబియా, ఈజిప్టు, అరబ్ ఎమిరేట్స్ తదితర విదేశాల్లోనూ నిర్వహిస్తామని దిమిత్రివ్ చెప్పారు.