అతలాకుతలం చేసిన కుండపోత వర్షం  

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. రాజధాని హైదరాబాద్ భారీ వర్షంతో తడిసి ముద్దయింది. జోరుగా కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు తటాకాలను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించింది. 

భారీ వర్షం కారణంగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో పిర్జాదిగూడలో గోడ కూలిన ఘటనలో ప్రవీణ్‌కుమార్(42), మోహన్(12) అనే కార్మికులు మృతి చెందారు. మర్పల్లిమండంలో వాగును దాటుతుండగా తల్లి మృతి చెందింది.

హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో జిహెచ్‌ఎంసీ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇల్లు విడిచి బయటకు రావొద్దని ఇటు జిహెచ్‌ఎంసీ, అటు పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కేవలం 2 గంటల్లోనే 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో, గాలి తోడుగా వర్షం బీభత్సం సృష్టించింది.  లోతట్టు ప్రాంతాలను నీళ్లతో నింపేసి, రహదారులను ముంచేసి నగరవాసులను బెంబేలెత్తించింది. వరద ధాటికి హకీంపేట్‌, టోలిచౌకీ తదితర ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. 

రాజధానిలో ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు నిండాయి. వాన ప్రభావానికి కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోయింది. మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

బుధవారం సాయంత్రం నుంచి పెద్దపెట్టున భారీ వర్షం కురుస్తుండటంతో అప్పటికే వివిధ పనులపై తమ తమ వాహనాలతో బయటకు వచ్చిన వాహన చోదకులు రోడ్లన్నీ తటాకాలుగా మారడంతో తమ వాహనాలను నడిపేందుకు ఇబ్బందుల పాలయ్యారు. దీంతో నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. వాహన చోదకులు మెట్రో లైన్ వెంబడి తమ వాహనాలను నిలుపుదల చేసుకుని వర్షం ఎప్పుడు తగ్గుతుందోనని నిరీక్షించారు. 

వర్షం తెరపి ఇవ్వకపోవడంతో కొందరు వాహన చోదకులు అతి కష్టం మీద తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. జిహెచ్‌ఎంసీకి చెందిన మాన్‌సూన్ బృందాలు రంగంలోకి దిగాయి. 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షం దంచికొడుతోంది. కుంభవృష్టినే తలపిస్తోంది. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు కోతకు గురయ్యాయి. వరద నీరు ఇళ్లల్లోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.