జపాన్ ప్రధానిగా సుగా ఎన్నిక

జపాన్ ప్రధానిగా సుగా ఎన్నిక
జపాన్ కొత్త ప్రధానిగ యోషిహిడే సుగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ ప్రధానిగా ఉన్న షింజో అబే అనారోగ్య కారణాలతో పదవీవిరమణకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తనకు అత్యంత విశ్వాసపాత్రుడు, వివాదరహితుడు అయిన సుగా వారసుడు అయ్యేందుకు రంగం సిద్ధం చేశారు. 
 
జపాన్ పార్లమెంట్ బుధవారం నాడు సుగాను ప్రధానిగా ఎన్నుకుంది. సోమవారమే పద్థతి ప్రకారం సుగాను అధికార పార్టీ నాయకులుగా ఎన్నుకున్నారు. అబే మంత్రిమండలిలో సుగా ప్రధాన కేబినెట్ సెక్రెటరీగా వ్యవహరించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన సుగా స్వయంశక్తితో ఎటువంటి గ్రూప్‌ల బలం లేకుండా రాజకీయ నేతగా ఎదిగారు. 
 
దేశంలోని సామాన్యులు, గ్రామీణ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలే కీలకంగా పాటుపడుతూ వచ్చారు. తనకు మార్గదర్శకులు అయిన అబే అసంపూర్తి వాగ్దానాలను తాను తీర్చేందుకు యత్నిస్తానని, కరోనా వైరస్‌పై పోరు, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తన ప్రాధాన్యతాంశాలని సుగా తెలిపారు. 
 
అంతకు ముందు అబే పదవికి రాజీనామా చేసి విలేకరులతో మాట్లాడుతూ సుగా ప్రభుత్వానికి తన నుంచి పూర్తి మద్దతు ఉంటుందని, ప్రజానీకం దేశ నూతన నాయకత్వానికి మునుపటిలాగానే పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 
 
తాను దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అంకితభావంతో పనిచేశానని, దేశ జాతీయ ప్రయోజనాల పరిరక్షణ దిశలో దేశ దౌత్యనీతిని పటిష్టం చేశానని అబే చెప్పారు.