24 గంటల పాటు ఫేస్‌బుక్‌ పోస్టులు బంద్‌

24 గంటల పాటు ఫేస్‌బుక్‌ పోస్టులు బంద్‌
విద్వేషపూరిత, తప్పుడు సమాచారాన్ని అందిస్తున్న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ వైఖరిపై ప్రపంచ నలుమూలల నుండి అందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ఈ ఆందోళనను మరింత బలోపేతం చేసేందుకు హాలీవుడ్‌ నటి కిమ్‌ కర్ధేషియన్‌ వంటి ప్రముఖులు సైతం భాగస్వాములవుతున్నారు. ఫేస్‌బుక్‌ వైఖరికి నిరసనగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లో 24 గంటల పాటు ఎటువంటి పోస్ట్‌లను చేయకూడదని నిర్ణయించుకున్నారు.
 
ఆమెతో పాటు హాలీవుడ్‌ ప్రముఖులు టైటానిక్‌ ఫేమ్‌ లియోనార్డో డికాప్రియో, సచా బారోన్‌ కోహెన్‌, కాటీ పెర్రీ, మైఖైల్‌ బిజోర్డాన్‌ వంటి వారు తమదైన స్టైల్స్‌లో నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ‘ స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌’ అంటూ ఓ ఫోటోను సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేస్తున్నారు. 
 
‘అమెరికాను విభజించేందుకు కొన్ని సమూహాలతో విద్వేషాన్ని, తప్పుడు సమాచార ప్రచారాన్ని సంస్థ కొనసాగిస్తున్న వైఖరిపై సైలెంట్‌గా కూర్చొలేము’ అన్న సందేశాన్ని పోస్ట్‌ చేశారు.