
వకీల్‌గా పనిచేసే రజ్వీ ఇత్తెహద్లో స్థానిక నాయకుడిగా ఉండి పార్టీలో పేరుతోపాటు పట్టు సాధించిండు. రాజుని కాపాడాలని కోరుతూ ‘అనల్ మాలిక్’ అంటూ ఊరేగేవాళ్లు. ‘ప్రతి ముస్లిం పాలకుడే(రాజే)’ అనేది వాళ్ల నినాదం. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత బ్రిటీష్ వాళ్లు పోతే నిజాం రాజ్యం కూల్చుతారని రజ్వీకి భయం పట్టుకుంది.
ఈ ప్రైవేటు సైన్యం వ్యవహారం పట్ల నిజాం కొంత ఇబ్బంది పడ్డా, తన ప్రయోజనం కూడా ఉంది కాబట్టి ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించిండు. రజ్వీ ఆగడాలు, దాడులను నిజాం నిలువరించే ప్రయత్నం చేయలేదు. రజ్వీకి ప్రగల్బాలు ఎక్కువ. ఢిల్లీ పాలకులు నిజాం జోలికి వస్తే ఎర్రకోట మీద అసఫ్‌జాహీ (నిజాంల రాజవంశం పేరు) జెండా ఎగరేస్తానని, బంగాళఖాతంలోని నీళ్లు నిజాం పాదాలను కడుగుతాయని ప్రగల్బాలు పలికిండట.
చివరకు జునాగఢ్, కాశ్మీర్ కూడా భారత్ లో విలీనమైన తర్వాత మిగిలిపోయిన హైదరాబాద్ గురించి భారత్ ప్రభుత్వం సతమతమవుతున్న సమయంలో భారత పత్రికల్లో హైదరాబాద్ దక్కన్లో రజాకార్లు, కమ్యూనిస్టులు అరాచకాలు చేస్తున్నట్లుగా వార్తలు రావడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
భారత ప్రభుత్వం సైనికచర్య తీసుకుంటుందనే అనుమానం రావడంతో చివరి ప్రయత్నాలు కూడా చేసింది నిజాం ప్రభుత్వం. కొద్ది నెలలకే జనవరి 5, 1948న హైదరాబాద్ దక్కన్‌కి ప్రతినిధి జనరల్ (హైదరాబాద్‌లో భారత రాయబారి)గా కె ఎం మున్షీని భారత ప్రభుత్వం నియమించింది.
ఈ పరిస్థితుల్లో నిజాం ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న చత్తారీ ఈ పరిస్థితుల్లో రాజీనామా చేసిండు. ఒకపక్క రైతు సంఘాలు గ్రామాల్లో పట్టు సంపాదించాయి. మరోపక్క హైదరాబాద్‌లో రజాకార్ల చెలరేగిపోతున్నారు. సరిహద్దుల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో భారత ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తేవడానికి పూనుకుంది.
సెప్టెంబర్ 13న (మొదటి రోజు) భారత ప్రభుత్వ ఆదేశాలతో ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానం విముక్తికి ప్రయత్నాలు ప్రారంభించింది. హైదరాబాద్ దక్కన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు సైన్యం ఉదయం బయలుదేరింది. హైదరాబాద్ రాజ్యానికి నలు వైపుల నుంచి రాజ్యాన్ని భారత ఆర్మీ చుట్టుముట్టింది.
యుద్ధ ట్యాకుంలతో సరిహద్దులు దాటి, లోపలికి ప్రవేశించాయి. వరంగల్, బీదర్, రాయచూర్, ఆదిలాబాద్, ఔరంగాబాద్ వైమానిక స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బాంబులు కురిపించింది. నిజాం సైన్యానికి దిక్కు తోచలేదు.
ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్, ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ, సైనిక కమాండర్ కలిసి చర్చించుకున్నారు. భారత రాయబారి కేఎం మున్షీని రెసిడెన్సీ నుంచి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ (నేటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్)కు మారాలని ప్రధాన మంత్రి లాయక్ అలీ ఆదేశించిండు. మున్షీ ఇంటి ముందు కాపలా ఉండే భారత సైనికుల ఆయుధాలను నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ రాజ్యంలో జరుగుతున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ స్టేట్ ప్రతినిధి, పాకిస్థాన్‌లో ఉండే హైదరాబాద్ దక్కన్ రాయబారికి సమాచారం అందించారు. సాయంత్రానికి నల్దుర్గ్ లోయలోకి ఇండియన్ ఆర్మీ ప్రవేశించింది. ఉస్మానాబాద్ పట్టణాన్ని ఆక్రమించింది.
సెప్టెంబర్ 14న (రెండో రోజు) నిజాం సైన్యం నుంచి తీవ్రమైన ప్రతిఘటన లేకుండానే భారత ఆర్మీ అన్ని వైపుల నుంచి ముందుకు దూసుకుపోతోంది. ఉదయానికే ఔరంగాబాద్ పట్టణాన్ని భారత సైన్యం చేజిక్కించుకుంది. నిజాం నిరాశలో ఉన్నాడు. ఆయన్ని కలిసేందుకు వచ్చిన ప్రధానమంత్రిని చూసి ఉస్మాన్ అలీఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తూర్పు నుంచి చొచ్చుకు వస్తున్న భారత సైన్యాన్ని నిలువరించడానికి వైరా, పాలేరు రిజర్వాయర్ల గేట్లు ఎత్తాలని, దిగువభాగంలో కాలువల కట్టలు తెంచాలని ప్రధాన మంత్రి లాయక్ అలీ ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చిండు. వాళ్లు చెప్పినట్లే చేశారు.
నల్లరేగడి నేలలు బురదమయం కావడంతో భారత సైనికులు నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. వాహనాలు రాలేకపోయాయి. అప్పుడు అనుకూలంగా ఉన్న హుజూరాబాద్– మిర్యాలగూడ దారి గుండా భారత ఆర్మీ మూసీ కాజ్‌వేను దాటింది. ఆ దళాలను నిలువరించడానికి సూర్యాపేట – నకిరేకల్ దారిలో మూసీపై ఉన్న వంతెనని నిజాం ప్రభుత్వం కూల్చివేసింది. మూసీని దాటి రాకుండా వరద పెంచాలని హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు.
ఆ రోజు రాత్రి.. ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌కి కాశిం రజ్వీ మొదటిసారిగా వచ్చిండు. దక్షిణ, తూర్పు ప్రాంతాలలో యుద్ధానికి పంపడానికి రజాకార్లు కావాలని ప్రధాన మంత్రి కోరగా ‘ఎంత మంది కావాలంటే అంత మందిని పంపిస్తా’నని రజ్వీ చెప్పిండు. వెంటనే హైదరాబాద్ సిటీలో పర్యటించిన రజ్వీ నాలుగు బెటాలియన్లకు సమానమైన వలంటీర్లను సిద్ధం చేసిండు.
హైదరాబాద్ రాజ్యాన్ని భారత సైన్యం ఆక్రమించుకోకుండా నిలువరించలేమని అర్థమైపోయి కనీసం హైదరాబాద్ నగరాన్ని అయినా కాపాడుకోవాలనే ఆలోచనలో పడింది నిజాం ప్రభుత్వం. అయితే, కల్యాణి –బీదర్ దారిలో భారత సైన్యం వేగంగా దూసుకువస్తున్నట్లు ఆర్మీ కమాండర్ ప్రధాన మంత్రికి ఫోన్ చేసి చెప్పిండు. ఆర్మీ కమాండర్‌కి ఆశలు సన్నగిల్లాయి. నిజాంకి కూడా ఆశల్లేవు.
సెప్టెంబర్ 15న (మూడో రోజు) హైదరాబాద్ దక్కన్ పశ్చిమ భాగం భారత సైన్యాల వశమైంది. ఆపరేషన్ పోలోలో పాల్గొన్న ప్రధాన దళం దాలం నుంచి కల్యాణి పట్టణానికి చేరింది. భారత సైన్యం బీదర్‌ను ఆక్రమించుకున్నట్లుగా ఆకాశవాణి ప్రకటించింది. సైన్యం కల్యాణి –బీదర్ మీదుగా వస్తున్నట్లుగా సమాచారం అందిందని ప్రధాన మంత్రికి కబురు వచ్చింది.
అప్పటి మ్యాప్‌లో ఆ రోడ్డు లేదు. ఇదెలా సాధ్యమంటూ అప్పటి రోడ్ల చీఫ్ ఇంజినీర్కి ప్రధాన మంత్రి ఫోన్ చేసిండు. ఈ మధ్యే రోడ్డు వేశామని, ఓపెన్ చేశామని ఆయన చెప్పిండు. ఆ రోడ్డు ఉన్నట్లు కమాండర్‌కు తెలియదు. ఇంటెలిజెన్స్ వారికీ తెలియదు.కానీ భారత సైన్యం మాత్రం దాని గురించి తెలుసుకుందని అర్థమయ్యాక నిజాం ప్రభుత్వం తలపట్టుకుంది.
చేసేది లేక సైన్యాన్ని జహీరాబాద్ దగ్గర మోహరించారు. హైదరాబాద్‌కు వేగంగా చేరుకోకుండా అడ్డుకోవాలన్నది వ్యూహం. కానీ.. అప్పటికే పరిస్థితులన్నీ చేయిదాటిపోతున్నాయి.
సెప్టెంబర్ 16న (నాలుగో రోజు) బీదర్‌లో ఉన్న భారత ఆర్మీ జహీరాబాద్ వైపుకు కదిలింది. భారత సైన్యం అన్నివైపుల నుంచి దూసుకువస్తుంది. హైదరాబాద్ సైన్యం నిస్సహాయంగా ఉంది. రాత్రి ప్రధాన మంత్రి నిజాంని కలిసిండు. ఇప్పుడు రెండు మార్గాలున్నట్లుగా వాళ్ల మధ్య చర్చకు వచ్చింది.
నిజాం తప్పుకుని మంత్రి మండలికే పాలన అప్పగించడం లేదా మంత్రి మండలిని రద్దు చేసి భారత్ తో ఒప్పందం చేసుకోవడం. వీటిలో ఏది ఎంచుకున్నారని ప్రధాని అడిగితే రేపు పొద్దున తొమ్మిది గంటలకు చెబుతానని నిజాం అనడంతో ఆ సమావేశం ముగిసింది.
హైదరాబాద్ కేబినెట్ సమావేశమై మంత్రి మండలి రాజీనామా చేసింది. దానిని నిజాం అంగీకరించిండు. అదే రోజు మధ్యాహ్నం లాయక్ అలీ దక్కన్ రేడియో కేంద్రానికి చేరుకుని, హైదరాబాద్ రాజ్య స్వతంత్య్రంను కాపాడలేకపోయానని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేసిండు.
సెప్టెంబర్ 17న (ఇదో రోజు) భారత సైన్యం హైదరాబాద్‌కు 30 మైళ్ల దూరంలో బీబీ నగర్‌కు చేరుకుంది. భారత సైన్యానికి లొంగిపోవాలని నిజాం నిర్ణయించుకున్నాడు. తాను లొంగిపోతున్నట్లు రేడియోలో ప్రకటించాడు. ఆ తర్వాత రెసిడెంట్ జనరల్ మున్షీ రేడియోలో ప్రకటన చేసిండు. పాత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కొత్త పాలకులు సరిదిద్దుతారన్నది దాని సారాంశం.
సెప్టెంబరు 18న బొల్లారంలోని రెసిడెన్సీలో సందడిగా ఉంది. భారత ఆర్మీ మేజర్ జనరల్ చౌదరికి ఘనంగా స్వాగతం పలికారు. బొల్లారంలోని రెసిడెన్సీపై ఇండియా పతాకం ఎగిరింది. ఆ తర్వాత చౌదరి ఆధ్వర్యంలో సైనిక పాలన ప్రారంభమైంది. సెప్టెంబరు 19 నాటికి అన్ని దిక్కుల నుంచి ప్రవేశించిన సైన్యాలు హైదరాబాద్ చేరుకున్నాయి.
ఆ తర్వాత చౌదరి మిలటరీ పాలనను రద్దు చేసి సివిల్ సర్వెంట్ వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణా రావు ముఖ్యమంత్రి పదవి చేపట్టిండు.
17 సెప్టెంబరు 1948న జరిగిన ఆపరేషన్ పోలో తర్వాత నిజాం పాలన అంతమయింది. హైదరాబాద్ దక్కన్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత ఉస్మాన్ అలీఖాన్‌కు రాజప్రముఖ్ హోదా ఇచ్చారు.
దప్పికైనప్పుడు చెరువు తవ్వుకున్నట్టు ఇండియన్ యూనియన్ నుంచి యుద్ధం ముంచుకొస్తుంటే నిజాం ప్రభుత్వం అప్పుడు సైన్యానికి కావాల్సిన ఆయుధాల గురించి ఆలోచించింది. భారత సైన్యాలకు తీవ్రమైన ప్రతిఘటన లేకుండానే నిజాం సైన్యం చేతులెత్తేసింది. ఆయుధ సంపత్తి, సంఖ్యాబలంలో పెద్దదైన భారత ఆర్మీని ఎదురించాలంటే తగినన్ని ఆయుధాలు లేవని నిజాం సైన్యం ప్రభుత్వానికి చెప్పింది.
More Stories
గూడ్సు పట్టాలు తప్పలేదు.. కోరమాండల్ రైలే ఢీకొట్టింది
రైల్వే ప్రమాదానికి కారణం, బాధ్యులను గుర్తించాం
ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ