హనీట్రాప్‌ గూఢచర్యంలో కీలక నిందితుడి అరెస్ట్  

హనీట్రాప్‌ గూఢచర్యంలో కీలక నిందితుడి అరెస్ట్  

హనీట్రాప్‌ గూఢచర్యం కేసులో ఒక కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హైదరాబాద్‌ జోన్‌ అధికారులు  అరెస్టుచేశారు. గుజరాత్‌కు చెందిన ఇమ్రాన్‌ గిటేలి.. ఆపరేషన్‌ డాల్ఫిన్‌నోస్‌లో భాగంగా నౌకాదళ రహస్య సమాచారాన్ని  పాకిస్థాన్‌ గూఢచారులకు చేరవేస్తుండేవాడు.

రహస్యాలు చేరవేస్తున్న అధికారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండేవాడు. గుజరాత్‌లోని గోద్రాలోగల పంచమహల్‌ గ్రామంలో సోమవారం ఇమ్రాన్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. సరిహద్దుల్లో వస్త్రవ్యాపారం ముసుగులో పాక్‌ గూఢచారులు, ఏజెంట్లతో ఇమ్రాన్‌ సంబంధాలు కలిగి ఉన్నట్టు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు.

సోదాల్లో ఇమ్రాన్‌ వద్ద పలు పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు, రహస్యపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్‌ 120బీ, 121ఏ, అఫిషియల్‌ సీక్రెట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 3తోపాటు సంఘవ్యతిరేక చర్యల నిరోధక చట్టం సెక్షన్‌ 17,18ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారులు భారత నౌకాదళానికి చెందిన 14 మందిని అరెస్టు చేశారు.