జపాన్‌ కొత్త ప్రధానిగా యోషిహిడే సుగా   

జపాన్‌ కొత్త ప్రధానిగా యోషిహిడే సుగా   

జపాన్‌ కొత్త ప్రధానిగా యోషిహిడే సుగా బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) సోమవారం ఆయనను తమ నేతగా ఎన్నుకున్నది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా కొనసాగుతున్న షింజో అబే అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేసిన విష యం తెలిసిందే.

బుధవారం సుగాను జపాన్‌ ప్రధానిగా అధికారికంగా ప్రకటించనున్నారు. ఆయన 2021 సెప్టెంబరు దాకా పదవిలో కొనసాగుతారు.  లిబెరల్ డెమొక్రటిక్ పార్టీ నిర్వహించిన ఈ ఎన్నికల్లో సుగాకు 377 ఓట్లు లభించాయి. మిగిలిన అభ్యర్థులకు మొత్తంగా కలిపి 157 ఓట్లు దక్కాయి. దీంతో ప్రధానిగా సుగా బాధ్యతలు తీసుకోవడం లాంఛనప్రాయమే.

ప్రస్తుతం అబే ప్రభుత్వంలో చీఫ్ క్యాబినెట్ సెక్రటరీగా సుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయడంలో సుగాకు మంచి పేరు ఉంది.  జపాన్‌‌లో విదేశీ పర్యాటక పరిశ్రమ ఎదుగుదలకు సుగా తీవ్ర కృషి చేశారు. అలాగే సెల్‌‌ఫోన్ బిల్స్‌‌ తగ్గించడంలో, వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలలో మంచి ప్రతిభ చూపారు. ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలలో కూడా మంచి పేరు గడించారు.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే సుగాకు పలు సవాళ్లు స్వాగతం చెబుతున్నాయి. కరోనా వైరస్‌‌తో పడిపోయిన ఎకానమీ, తూర్పు చైనా సముద్రంలో డ్రాగన్ దుందుడుకు వైఖరి, టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ లాంటి పలు సవాళ్లు సుగా నాయకత్వ ప్రతిభకు సవాల్ విసురుతున్నాయి.