కరోనా వైరస్ ఉధృతిని ముందుగానే పసిగట్టి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలన్న నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం వల్లే దాదాపు 37,000 నుంచి 38,000 మరణాలను నివారించడంతోపాటు 14,000 నుంచి 29,000 మంది వైరస్ బారిన పడకుండా అడ్డుకోగలిగామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.
లోక్‌సభలో కొవిడ్ మహమ్మారి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఒక ప్రకటన చేస్తూ దేశంలోని దాదాపు 92 శాతం కొవిడ్ కేసులలో చాలా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, కేవలం 5.8 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ థెరపీ అవసరం కాగా 1.7 శాతం మందికి మాత్రమే ఇంటెన్సివ్ కేర్ అవసరమవుతోందని ఆయన తెలిపారు.n
సెప్టెంబర్ 11 నాటికి దేశంలో మొత్తం 45,62,414 నావెల్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, 76,271 మరణాలు సంభవించాయని మంత్రి చెప్పారు. దేశంలో మరణాల సంఖ్య 1.67 శాతంగా నమోదైందని ఆయన తెలిపారు. కొవిడ్-19 సవాలును కేంద్ర ప్రభుత్వం అత్యున్నత రాజకీయ సంకల్పంతో ఎదుర్కోవడానికి సిద్ధపడిందని ఆయన చెప్పారు.
ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా 35.62 లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నారని, ఇది మొత్తం కేసులలో దాదాపు 77.65 శాతమని ఆయన చెప్పారు. దేశంలో కొవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన సభాముఖంగా ప్రకటించారు. కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిషా, అస్సాం, కేరళ, గుజరాత్ రాష్ట్రాలలో నమోదయ్యాయని ఆయన తెలిపారు.
ఈ రాష్ట్రాలలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రతి 10 లక్షల మందిలో 3,325 మందికి వైరస్ సోకగా 55 మంది మరణించారని, వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆయన చెప్పారు.
కాగా, పాజిటివ్ కేసుల సంఖ్య 49లక్షల మార్క్‌ను దాటింది. కేసుల సంఖ్య పెరుగుతున్నా అదే స్థాయిలో బాధితులు కోలుకుంటున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 83,809 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,30,237కు చేరింది.
ప్రస్తుతం 9,90,061 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 38,59,400 మంది వైరస్ ప్రభావం కోలుకున్నారని తెలిపింది. వైరస్ ప్రభావంతో తాజాగా మరో 1,054 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మహమ్మారి కారణంగా 80,776 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది.
More Stories
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర
న్యూయార్క్‌లోని స్వామినారాయణ దేవాలయం ధ్వంసం