విమోచన స్ఫూర్తి కేంద్రంపై కేసీఆర్ కు లేఖ   

తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు  అవసరమైన స్థలం కేటాయించమని కోరుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి లేఖ వ్రాసారు. 
 
ఇటీవల తాను కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి ఈ అంశం గురించి ప్రస్తావించినపుడు, తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు వారు సానుకూలంగా స్పందించి, కేంద్ర ప్రభుత్వం నుండి స్పూర్తి కేంద్రం నిర్మాణానికి కావలసిన నిధులు అందిస్తామని చెప్పారని కిషన్ రెడ్డి ఆ లేఖలో వెల్లడించారు. .
 
 విశిష్ట, సాహసోపేత చరిత్ర ఉన్న ‘తెలంగాణ విమోచన పోరాటం’ గురించి ప్రస్తుత, భావితరాలు తెలుసుకుని స్ఫూర్తి పొందాల్సిన అవసరముందని గుర్తు చేశారు. దీనికోసం పూర్తిస్థాయిలో స్వాతంత్ర సమార యోధుల  చరిత్రతో కూడిన ప్రత్యేక  స్మారక స్ఫూర్తి కేంద్రం ఉండాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు.
 
తెలంగాణ విమోచన పోరాట ఉద్యమం గురించి పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని  కిషన్ రెడ్డి కోరారు. 
 
హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన అమరవీరుల  ఉద్యమ స్పూర్తి కెంద్రానికి భూమి కేటాయిస్తే, ఒక అద్భుతమైన, ప్రేరణాత్మకమైన ‘తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం’   భావితరాలకు  ఉపయోగపడే విధంగా ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 
తెలంగాణా ప్రాంతంలో నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట చరిత్ర తెలిసిన ప్రముఖ వ్యక్తీగా ఈ స్మారక స్పూర్తి కేంద్రం ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని వెంటనే కేటాయించి, నిర్మాణానికి వ్యక్తిగతంగా  ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆ లేఖలో కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.