ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు 

హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌లో ఇద్దరు లంచగొండులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఓ కంపెనీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లెక్కల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో ఇద్దరు అధికారులు ఏకంగా  రూ 5  కోట్లు లంచం డిమాండ్‌చేశారు. దీనిపై ఆధారాలు లభించడంతో ఇద్దరు అధికారులపై సీబీఐ కేసు నమోదుచేసింది.

హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ కార్యాలయంలో సేవాపన్ను ఎగవేత నిరోధక విభాగంలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న సుధారాణి చిలక, అప్పట్లో సేవాపన్ను ఎగవేత నిరోధక విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన బొల్లినేని శ్రీనివాస గాంధీ రూ.5 కోట్లు డిమాండ్‌ చేసినట్లు ఆధారాలు లభించాయి. 

దీంతో సీబీఐ అధికారులు ఐపీసీ 120 బి, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 12, 7(ఏ) సెక్షన్ల కేసు నమోదుచేశారు. అదేవిధంగా అధికారులకు అడిగిన లంచం ఇచ్చేందుకు అంగీకరించి, అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు చెల్లించిన భరణి కమాడిటీస్‌ కంపెనీ ఎండీ సత్య శ్రీధర్‌రెడ్డిపైనా సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. 

భరణి కమాడిటీస్‌ కంపెనీకి సంబంధించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల విషయంలో అవకతవకలపై ఆ కంపెనీ ఎండీ సత్య శ్రీధర్‌రెడ్డిపై 2019 మార్చి 6న జీఎస్టీ అధికారులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో శ్రీధర్‌రెడ్డి అదే నెల 29న జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. 

అతడి భార్య రాఘవిరెడ్డి పేరిట ఉన్న హైదరాబాద్‌ స్టీల్స్‌ కంపెనీలోనూ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్స్‌కు సంబంధించి అవకతవకలు జరిగాయని, ఆ కేసులో రాఘవిరెడ్డిని అరెస్టుచేయాల్సి ఉన్నదని జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌ సుధారాణి, అప్పటి సూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాసగాంధీ సత్యశ్రీధర్‌రెడ్డిని బెదిరించారు. 

కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.5 కోట్లు లంచం డిమాండ్‌ చేశారు. ఇందులో రూ.10 లక్షలను 2019 ఏప్రిల్‌15న సత్యశ్రీధర్‌రెడ్డి వారికి ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని డబ్బురూపంలో కాకుండా ఇండ్ల స్థలాలు లేదా వ్యవసాయ భూముల రూపంలో ఇవ్వాల్సిందిగా అధికారులు కోరారు. 

ఈ విషయాలపై జీఎస్టీ కమిషనరేట్‌లోని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. అంతర్గత విచారణ అనంతరం జీఎస్టీ కమిషనరేట్‌ ఉన్నతాధికారులు ఈ అంశాలపై సీబీఐ అధికారులకు ఫిర్యాదుచేశారు. దీనిపై 2019 అక్టోబర్‌ 31న సీబీఐ అధికారులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. 

అన్ని పత్రాలను పరిశీలించిన అనంతరం రూ.5 కోట్ల లంచం డిమాండ్‌ చేయడం, అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకున్నట్టు కీలక ఆధారాలు లభించాయి. ఈ మేరకు శుక్రవారం ముగ్గురిపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.