భారతదేశం తన అంతరిక్ష సంపదను పెంపొందించుకుని మారుతున్న కాలానికి దీటుగా తన అంతరిక్ష నిఘా వ్యవస్థను విస్తరించుకోవాలని ఇస్రో మాజీ చైర్మన్, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త జి మాధవన్ నాయర్ సూచించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
భద్రతకు సంబంధించిన అన్ని కార్యకలాపాలలో అంతరిక్షం కీలక పాత్రను పోషిస్తుందని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. భూ పరిశీలన, కమ్యూనికేషన్, ఎలెక్ట్రానిక్ నిఘా వ్యవస్థ తదితర అనేక రంగాలలో అంతరిక్షానిది ప్రధాన పాత్రగా మారిందని ఆయన చెప్పారు.
తనకు అర్థమైనంతవరకు చైనా తన రామార్ ఇమేజింగ్ ఉపగ్రహాలను, భూ పరిశీలన ఉపగ్రహాలను, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను అనేక రెట్లు పెంచి యావత్ ప్రపంచంపై తన దృష్టిని సారించే సామర్ధాన్ని పెంచుకుందని ఆయన చెప్పారు. దీని వల్ల తమ ఉపగ్రహాల నుంచి అన్ని రకాల సమాచారాన్ని అది రాబడుతోందని ఆయన పేర్కొన్నారు.
భారత్ విషయానికి వస్తే ప్రపంచాన్ని పక్కనపెట్టి కనీసం తన సరిహద్దుల వెంబడి నిరంతర నిఘాను పెంపొందించుకునే ఆలోచన చేయాలని ఆయన సూచించారు. వివిధ రంగాలలో ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించే సామర్ధాన్ని భారత్ ప్రదర్శించిందని, అయితే ఇప్పుడు సరిహద్దుల వెంబడి నిరంతరం నిఘాను పెంచుకునే ప్రణాళికను భారత్ రూపొందించుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఇందుకోసం భారత్ తన ఉపగ్రహాల సంఖ్యను, అంతరిక్ష కేంద్రాలను ఇతర సంబంధిత వ్యవస్థలను ఎన్నో రెట్లు పెంచుకోవలసిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ యుద్ధాలలో అంతరిక్షం కీలకమైన పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
More Stories
ఖైదీలలో కులవివక్ష పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం
హెచ్సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్కు ఈడీ సమన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీడియాపై 50 శాతం పెరిగిన దాడులు!