బౌద్ధారామంలో ఇళ్లస్థలాలుపై హైకోర్టు స్పందన  

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం మంగమారిపేట పరిధిలో ఉన్న తొట్లకొండ బౌద్ధారామంలో ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. 

తదుపరి విచారణను వచ్చే 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌రావు, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చారిత్రక బౌద్ధక్షేత్రమున్న తొట్లకొండపై ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని విశాఖ జిల్లాకు చెందిన కొత్తపల్లి వెంకటరమణారావు ఈ వ్యాజ్యం  దాఖలు చేశారు. 

2 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బౌద్ధారామం ఎంతో పవిత్రమైనదని, జపాన్‌, మంగోలియా, థాయ్‌లాండ్‌, నేపాల్‌, చైనా తదితర దేశాల భక్తులు ఇక్కడకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారని తెలిపారు. బంగాళాఖాతం తీరాన ఉన్న ఈ చారిత్రక ప్రాంతాన్ని 1976లో పురావస్తు శాఖ గుర్తించిందని పేర్కొన్నారు.

3,148 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న ఈ ప్రాంతంలో రాష్ట్ర పర్యాటకశాఖ ఓ అతిథి గృహాన్ని నిర్మించేందుకు ప్రయత్నించగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలో ఇదే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా అధికారులు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు.

ఇది పురావస్తుశాఖ చట్టం, సముద్రతీర రక్షణ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టాలకు పూర్తి విరుద్ధమని, అందువల్ల ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని అభ్యర్థించారు. అయితే  ఈ కొండపై ఉన్న నిర్దేశిత 120 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టరాదని మాత్రమే హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని, మిగిలిన ప్రదేశంపై ఎలాంటి నిషేఽధాజ్ఞలు లేవని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.