విద్య త‌ర‌గ‌తి గ‌దికి ప‌రిమితం కావ‌ద్దు

విద్య అనేది విద్యార్థుల‌ జీవితాల‌కు ఉప‌యోగ‌ప‌డాలని, అంత‌టి మెరుగైన విద్య‌ను నేర్చుకోవాలంటే చదువులను తరగతి గదులకే పరిమితం చేయరాదని ప్రధాని న‌రేంద్రమోదీ సూచించారు. చదువులను బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేయాలని, అందువ‌ల్ల దాని ప్రభావం విద్యార్థుల జీవితాలపై మాత్రమే కాకుండా యావత్తు సమాజంపైనా ఉంటుందని ఆయ‌న‌ చెప్పారు.

నూత‌న జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం 21వ శతాబ్దంలో పాఠశాల విద్య అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఎన్ఈపీ ఆవశ్యకతను వివరిస్తూ, దేశ విద్యావ్యవస్థలో దానివల్ల రాబోయే మార్పులను వివరించారు. ఎన్ఈపీ నూతన శకానికి ఆరంభమని చెప్పారు. భారతీయ విద్యావ్యవస్థ గత మూడు దశాబ్దాలుగా మార్పులు లేకుండా ఉన్న‌ద‌ని,  అందుకే నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చామ‌ని చెప్పారు.

విద్యాబోధ‌న‌లో సులువైన, వినూత్నమైన పద్ధతులను పెంచాలని ప్ర‌ధాని సూచించారు. నవతరం శిక్షణకు మన ప్రయోగం మూలాధారం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆకర్షించడం, అధ్యయనం చేయడం, అనుభూతి చెందడం, వ్యక్తపరచడం, అసాధారణ ప్రతిభ కనబరచడం కోసం కృషి చేయాలని సూచించారు. బాలలు అన్ని రకాలుగా సమగ్రంగా ఆలోచించగలగాలని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలని సూచ‌న చేశారు. 

భార‌త దేశ కొత్త ఆకాంక్ష‌ల‌ను, ఆశ‌ల‌ను నిజం చేసే విధంగా కొత్త జాతీయ విద్యావిధానం ఉంద‌ని ప్ర‌ధాని తెలిపారు.  అంద‌రం క‌లిసి ఎన్ఈపీ2020ని దేశ‌వ్యాప్తంగా ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని పేర్కొంటూ   తమ ప్ర‌భుత్వం ఎన్ఈపీపై సూచ‌న‌లు కోర‌గా సుమారు 15 ల‌క్ష‌ల‌కుపైగా సూచ‌న‌లు వ‌చ్చిన‌ట్లు మోదీ గుర్తు చేశారు. 

గ‌త 5 ఏళ్ల నుంచి వివిధ ద‌శ‌ల్లో సాగిన ప్ర‌య‌త్నం వ‌ల్లే ఎన్ఈపీ2020 సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు. ఇంకా ఈ ప‌ని పూర్తి కాలేద‌ని, ఇది ప్రారంభం మాత్ర‌మే అని తెలిపారు. ఎన్ఈపీని ప‌టిష్టంగా అమ‌లు చేయ‌డమే మ‌నంద‌రి ముంద‌న్న బాధ్య‌త అని మోదీ తెలిపారు. 

ప్రీ స్కూల్ అనేది చిన్నారులకు ఇంటి బ‌య‌ట‌ తొలి అనుభ‌వం అని, అయితే ప్రీ స్కూల్ స్థాయి నుంచే స‌ర‌దాగా చ‌దువు నేర్పే టీచ‌ర్లు కావాల‌ని సూచించారు.  ఫ‌న్ లెర్నింగ్‌, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌, డిస్క‌వ‌రీ బేస్డ్ లెర్నింగ్ అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు.