బీజేపీలో కంగనా రనౌత్‌ తల్లి ఆశా రనౌత్‌  

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తల్లి ఆశా రనౌత్‌ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తున్నది. బీజేపీలో చేరాలని ఆశా రనౌత్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ నాయకత్వం కోరింది.  కంగనా రనౌత్‌కు వై ప్లస్‌ సెక్యూరిటీ కల్పించినందుకు ఆశా  బీజేపీకి కృతజ్ఞతలు తెలిపిన మరుసటి రోజే  ఆమె పార్టీలో  చేరాలనుకుంటే స్వాగతిస్తామని  బీజేపీ తెలిపింది.

ఆశా రనౌత్‌  అధికారికంగా పార్టీలో చేరలేదని, బీజేపీకి మద్దతు ఇవ్వడం గురించి ఆమె ప్రకటనలు చేశారని కంగనా సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ శాఖ ‌ వెల్లడించింది.

‘తన కుమార్తెకు భద్రత కల్పించడంపై ఆమె బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు రనౌత్‌ కుటుంబం కాంగ్రెస్‌ పార్టీకి విధేయులుగా ఉండేదని,  ఇప్పుడు మాత్రం బీజేపీకు మద్దతునిస్తున్నదని’ హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్‌ కుమార్‌ కశ్యప్‌ చెప్పారు.

‘బీజేపీలో చేరడానికి సంబంధించి,  ఆమె ఇంకా అధికారికంగా పార్టీలో చేరలేదు. దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆమె పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటే, మేం స్వాగతిస్తామని’ వివరించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం, మోదీ సర్కార్‌కు కంగనా తల్లి  ధన్యవాదాలు తెలిపారని  కశ్యప్ చెప్పారు.