ఇద్దరు పాకిస్థాన్ స్మగ్లర్లు హతం 

పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) నిరోధించింది. వీటిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.   

బీఎస్ఎఫ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 8, 9 మధ్య రాత్రి రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లా ఖయలివాలా బోర్డర్ ఔట్‌పోస్ట్ వద్ద ఈ సంఘటన జరిగింది. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతున్నట్లు స్పష్టమైన సమాచారం అందడంతో బీఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. 

స్మగ్లర్ల దుష్ట యత్నాలను నిలువరించి, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు అక్రమంగా భారత దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించారు. ఇద్దరు స్మగ్లర్లను కంచె వద్ద కాల్చి చంపారు. 

ఇద్దరి మృత దేహాల వద్ద రెండు తుపాకులు, నాలుగు మ్యాగజైన్స్, సుమారు 8 కిలోగ్రాముల మాదక ద్రవ్యాలు, రాత్రి వేళల్లో చూడగలిగే పరికరం, ఒక పిస్టల్ కవర్, ఓ చిన్న కత్తి, రూ.13 వేల విలువైన పాకిస్థాన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వీరివద్ద లభించిన నేషనల్ ఐడీ కార్డులో ముస్తాక్ అహమద్ కుమారుడు షహబాజ్ అలీ అని ఉంది.