ఉస్మానియా దవాఖనలోని జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ జూనియర్ డాక్టర్లు మంగళవారం డ్యూటీలు బంద్ జేసి సమ్మెకు దిగారు. ఆపరేషన్ థియేటర్లలో సౌకర్యాల్లేవని, ఆక్సిజన్ పోర్టులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండ్రోజుల్లోగా ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన ఆపరేషన్ థియేటర్‌ను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమర్జెన్సీ డ్యూటీలు కూడా బంజేస్తమని హెచ్చరించారు. ఆపరేషన్ థియేటర్ లేక ఆర్థోపెడిక్ సర్జరీలు కూడా ఆగిపోతున్నాయని, మరో రెండ్రోజులు చూసి జూడాలందరూ సమ్మెకు వెళ్లాలనే యోచనలో ఉన్నారని జూడాల అసోసియేషన్ ఉస్మానియా విభాగం అధ్యక్షుడుడాక్టర్ లోహిత్ తెలిపారు.
ఈ సీజన్ లో భారీ వర్షాలకు ఉస్మానియా పాత భవనంలోకి నీళ్లు రావడంతో ప్రభుత్వం ఆ భవనాన్ని మూసివేసింది. కానీ వేరే ఏర్పాట్లు మాత్రం చేయలేదు. జనరల్ సర్జరీ, ఆర్థో సహా పలు విభాగాల ఆపరేషన్ థియేటర్లు అన్నీ పాత భవనంలోనే ఉన్నాయి.
కులీకుతుబ్‌షా బిల్డింగ్‌లో తాత్కాలికంగా ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారని, అయితే అందులో ఆపరేషన్లకు అవసరమైన సదుపాయాలు లేవని జూడాలు చెబుతున్నారు. వివిధ జబ్బులతో రోగులు వస్తున్నారని, వాళ్లకు ఆపరేషన్లు అవసరమైనప్పటికీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆపరేషన్లను వాయిదా వేస్తుండడంతో రోగులకు ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. పైగా, తాము ఏమీ నేర్చుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే డీఎంఈ రమేశ్‌రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ సహా అందరి దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయినదని వాపాయారు.
జూడాల సమ్మె నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశామని, అన్ని విభాగాల్లోనూ సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.
More Stories
హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు
కూల్చివేతలపై రాహుల్ ఆగ్రహం… రేవంత్ ధిక్కారస్వరం!