విమోచన దినంపై కేసీఆర్ రెండు నాల్కల ధోరణి  

విమోచన దినంపై కేసీఆర్ రెండు నాల్కల ధోరణి  
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా, అధికారికంగా జరపాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని నాటి సీఎం రోశయ్య గారితో పాటు తదితరులను విమర్శించిన కేసిఆర్‌ ఇప్పుడు ఎందుకు మౌనం వహించారని నిలదీశారు. 
 
సెప్టెంబర్ 17 విషయంలో ఉద్యమ సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారని ధ్వజమెత్తారు. రోజుకో వేషం, పూటకో మాటతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
కెసీఆర్‌ మజ్లీస్‌తో లోపాయికారీ ఒప్పందంతో రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమరించారు. ఆచరణ సాధ్యంకాని హామీలిస్తూ తెలంగాణను రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ కు తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఎలగబెడతానంటూ దేశాన్ని కూడా పాకిస్తాన్ కు తాకట్టుపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
హైదరాబాద్‌లోని వారి కుటుంబం, టీఆర్ఎస్ నాయకుల అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరణ చేసుకోవటానికే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకొచ్చారని ఆరోపించారు. కేసీఆర్ ఈ ఎల్ఆర్ఎస్ పేరుతో పేదల రక్తం తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ ద్రోహులను పక్కనబెట్టుకొని పరిపాలన చేస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 
 
ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఉద్దేశపూర్వకంగా మరగునపరుస్తున్న తెలంగాణ అమరవీరుల చరిత్రను నేటి తరానికి తెలియజెప్పే సంకల్పంతో నాటి చారిత్రక ప్రాంతాలను సందర్శించారు. రెండు రోజుల యాత్రలో భాగంగా తొలిరోజు జరిగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 
 
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ బిజెపి శ్రేణులు, ప్రజలు నినదించారు.  
యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక, రేణికుంట సందర్శించడానికి బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి యాత్ర ప్రారంభించారు.  
 
యాదాద్రి జిల్లాకు చేరుకున్న సంజయ్ కుమార్ కుబీజేపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలేరు మండలంలోని కొలనుపాక, రాజపేట మండలంలోని రేణికుంటను సందర్శించి అక్కడి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. 
 
కొలనుపాక జైన్ మందిర్, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  రేణుగుంటలో తెలంగాణ పోరాటవీరుడు  చింతలపూడి రామ్ రెడ్డి గారి కుటుంబాన్ని కలిసి వారితో ముచ్చటించి అక్కడి సభలో పాల్గొన్నారు.  నాటి వీర యోధులకు త్యాగాలకు సాక్షమైన బైరాన్ పల్లికి చేరుకున్న సంజయ్ అక్కడి బురుజును సందర్శించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. 
 
అనంతరం చారిత్రక ప్రదేశాలైన కూటిగల్లు, తరిగొప్పుల, హన్మకొండ నుంచి పరకాల అమరధామం చేరుకొని, 
అక్కడి నుంచి రాత్రి బస కోసం గోదావరిఖనిలో బయలుదేరారు. మార్గమధ్యలో భూపాలపల్లి, మంథనిలో బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బుధవారం గోదావరిఖని నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభమై జోడేఘాట్, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో పర్యటన కొనసాగనుంది.