ఆగస్ట్ తొలి వారంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించేవారి సంఖ్య 2.15 శాతం ఉండగా, ఇప్పుడది ఏకంగా 1.7 శాతానికి దిగివచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షలకు చేరువవగా, మరణాల రేటు దిగిరావడం సానుకూల పరిణామమని చెప్పారు.
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5000లోపు కోవిడ్-19 కేసులున్నాయని, లక్షద్వీప్‌లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని వెల్లడించారు. దేశంలో 62 శాతం కరోనా యాక్టివ్ కేసులు కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. 70 శాతం మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయని తెలిపారు.
ప్రపంచంలోనే అతితక్కువగా భారత్‌లో ప్రతి పదిలక్షల మందిలో 3102 కోవిడ్-19 కేసులే వెలుగుచూశాయని చెప్పారు. రష్యా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. భారత్‌లో తయారీ, మూడో దశ పరీక్షల కోసం రష్యా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు.
మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేవ్ రాష్ట్రాల్లోనే దాదాపు 62 శాతం కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ప్రతి మిలియన్ మందికి 36,703 పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రతి పదిలక్షల జనాభాకు రోజుకు 758 పరీక్షలు జరుగుతున్నట్లు వెల్లడించింది.
ఇలా ఉండగా, దేశంలో గత 5 రోజులుగా రోజుకు 80 వేలకు పైగా, గత రెండు రోజులుగా రోజుకు 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సోమవారం కేసులు తగ్గుముఖం పట్టాయి.
గత 24 గంటల్లో 75,809 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,80,422 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,133 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 72,775 కు చేరుకుంది.
ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 5 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు వారాల్లోనే దాదాపు 1.33 కోట్లకు పైగా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. తాజా 1,016 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 423 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి
More Stories
ఖైదీలలో కులవివక్ష పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం
జార్ఖండ్లో రైల్వేట్రాక్ పేల్చివేత
వర్షాలు, వరదల వల్ల 1,492 మంది మృతి