అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో రెండు రోజుల క్రితం దగ్ధమైన 62 సంవత్సర చరిత్ర గల రధాన్ని చూడడానికి వచ్చిన రాష్ట్ర మంత్రులకు పలు హిందూ సంస్థలకు చెందిన వేలాదిమంది నుండి మంగళవారం తీవ్ర ప్రతిఘటన ఎదురైనది. వారి వాహనాలపై రాళ్లు రువ్వారు.
ఆలయం వద్ద రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించడానికి వచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావులను అక్కడ ఉన్న ధార్మిక సంఘాలు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది.
రథం దగ్ధమైన సంఘటనకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన విచారణ భక్తులను తప్పుదోవ పట్టించేదిగా ఉందని హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులకు భజరంగ్ దళ్ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఘటనా ప్రదేశం వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను ధార్మిక సంఘాలవారు తోసుకొని ముందుకు రావడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. పోలీస్ వలయంతో వారు తప్పించుకొని దేవాలయంలోకి వెళ్లారు. .
సింహద్వారాన్ని మూసివేసి, మూడు గంటలకు పైగా గడపవలసి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతున్నదని అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారికి నచ్చచెప్పి, వారి ప్రతినిధులు మంత్రులను కలుసుకొని ఏర్పాట్లు చేశారు. వారితో చర్చలు జరిపిన మంత్రులు ఈ నెల 15 లోగా నిందితులను పట్టుకొంటామని హామీ ఇచ్చారు.
మరోవంక ఆలయంలోని పురావస్తు అంశాలను, ఆలయ ఆస్తులను కైవసం చేసుకొనేందుకు రాజకీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆలయపు వంశపారంపర ధర్మకర్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. గత ఏడాదే వాటికి భీమా చేయడం పట్ల అనుమానాలకు బలం కలుగుతున్నట్లు పేర్కొన్నారు.
అంతర్వేది ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఘటనపై లోతైన విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆలయంలోపల దేవాదాయ శాఖ మంత్రి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. అలసత్వం వహించిన అధికారులపై ఇప్పటికే బదిలీ వేటు వేశామని, పలువురిని సస్పెండ్ చేశామని తెలిపారు.
ఇలా ఉండగా, బుధవారం బిజెపి చలో అంతర్వేది పిలుపునిచ్చింది. దీంతో ముందుగానే బిజెపి- జనసేన నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు ఏలూరు డిఐజి తెలిపారు. అంతర్వేది పరిసర ప్రాంతాల్లోకి ఇతరులకు అనుమతి లేదని, నిబంధనను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. రథం దగ్ధంపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
More Stories
ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్
కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం