అప్పుడు టిడిపికి హిందుత్వం గుర్తుకు రాలేదా?

అంతర్వేదిలో రధం దగ్ధంపై హిందుత్వానికి ప్రమాదం ఏర్పడినట్లుగా టిడిపి ఆందోళన వ్యక్తం చేయడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.  కృష్ణా పుష్కరాల్లో పలు దేవాలయాలను టీడీపీ నేలమట్టం చేసిందని గుర్తు చేస్తూ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి హిందుత్వం గుర్తుకు రాలేదా? అని  ప్రశ్నించారు.
హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీకి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. కృష్ణా పుష్కరాలలో 17 రకాల దేవాలయాలను తెలుగుదేశం ప్రభుత్వం నేలమట్టం చేసిందని గుర్తు చేశారు. ఆ సమయంలో విజయవాడ గోశాల ప్రాంతాన్ని తాము సందర్శించినపుడు తమపై బుద్దా వెంకన్న దాడికి ప్రయత్నించలేదా అని నిలదీశారు.
ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్క ఆలయాన్ని అయినా కట్టారా అని‌ ప్రశ్నించారు. ‘‘కృష్ణా పుష్కరాలలో ఆలయాలు కూల్చేసినపుడు చినరాజప్ప ఎక్కడున్నారు. ఆ రోజు మాట్లాడని ఈ రాజప్ప ఇపుడు అంతర్వేది ఘటనపై ఎలా మాట్లాడతారు’’ అంటూ సోము వీర్రాజు విమర్శించారు.
అంతర్వేది ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ముఖ్యమంత్రికి లేఖ రాశామని వీర్రాజు తెలిపారు. దేశంలో రాజధాని ‌నిర్మాణాలు ఎక్కడ జరిగినా అమరావతి అంత హైప్ ఎక్కడా లేదని ధ్వజమెత్తారు. చైనా, జపాన్, సింగపూర్‌లా అమరావతి రాజధాని‌ నిర్మిస్తామంటూ చంద్రబాబు గత ఐదేళ్లూ హైప్ క్రియేట్ చేశారని విమర్శించారు. 
 
జపాన్, సింగపూర్, చైనా అన్నావు కదా.. ఎందుకు అమరావతి నిర్మించలేదని అందరూ చంద్రబాబుని‌ ప్రశ్నించాలని  కోరారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ  7,200 కోట్లు ఏం చేశావని చంద్రబాబుని‌ నిలదీయాలని చెప్పారు. మాటతప్పిన చంద్రబాబును మీడియా ఎందుకు ప్రశ్నించదని వీర్రాజు దుయ్యబట్టారు.