ఉపాధ్యాయులే అసలైన జాతి నిర్మాతలు

ఉపాధ్యాయులే విద్యార్థులకు మార్గ నిర్దేశకులని, వారే అసలైన జాతి నిర్మాతలని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. ఉపాధ్యాయుల దినోత్సవం (సెప్టెంబర్5) సందర్భంగా జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఎంతో అంకితభావంతో, కృతనిశ్చయంతో ఉపాధ్యాయులు మన దేశ ఘన సంస్కృతి, చారిత్రక వైభవాన్ని విద్యార్థులకు అలవరుస్తారని తెలిపారు. 

మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులలో విద్యాబోధన జరిగి మన యువజనులు మరింత సమర్థంగా సమాజానికి సేవలందచేయాలని ఆయన ఆకాంక్షించారు. మేధోవంతులైన ఉపాధ్యాయులు మన దేశ భవిష్యత్తును అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి తమ కృషిని కొనసాగిస్తారని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు ప్రోత్సాహాన్ని అందచేస్తారని, ఇదే మన భారతీయ స్కృతికి సంబంధించిన గురు శిష్య పరంపర సిద్ధాంతమని ఆయన తెలిపారు. 

మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియచేశారు.

కాగా,  ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్వీట్ చేశారు. ఉపాధ్యాయులందరికీ ఆయన కృతజ్ఞతలు ప్రకటించారు. జాతికి వారు చేస్తున్న గొప్ప సేవలను ప్రశంసించారు.

‘‘జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు. విద్యార్థుల మనసులను తిప్పడంలోనూ వారి పాత్ర కీలకమే. వారందరికీ కృతజ్ఞతలు ప్రకటిస్తున్నా. గురుపూజా దినోత్సవం సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులందరికీ  కృతజ్ఞతలు. సర్వేపల్లి రాధాకృష్ణణ్‌కు నివాళులు అర్పిస్తున్నా. మన ఉపాధ్యాయులే మన హీరోలు’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.