ఐదుగురిని ఎత్తుకెళ్లిన చైనా, చైనా పౌరులను కాపాడిన భారత్ 

భార‌త‌దేశ స‌రి‌హద్దుల్లో చైనా నిత్యం ఏదో ఒక స‌మ‌స్య సృష్టిస్తూనే ఉన్న‌ది. స‌రిహ‌ద్దు అంశంలో ఇరుదేశాల మ‌ధ్య గ‌త‌కొంత‌కాలంలో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.
తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో ఐదుగురు స్థానిక భారత పౌరులను చైనా సైనికులు అపహరించగా, సిక్కిం సరిహద్దులో దారి తప్పిన ముగ్గురు చైనా పౌరులను భారత్ సైన్యం కాపాడి, సురక్షితంగా తిరిగి పంపింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు స్థానికుల‌ను చైనా బలగాలు అపహరించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ ఆరోపించారు. రాష్ట్రంలోని చైనా స‌రిహ‌ద్దుల్లోని నాచోకు చెందిన ఐదుగురిని పొరుగుదేశ సైన్యం ఎత్తుకెళ్లింద‌ని, గతంలో కూడా ఇలాంటివి జరిగాయని ఆయన తెలిపారు.
స‌రిగ్గా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలో చైనా, ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ‌ మంత్రుల‌తో స‌మావేశం కొన‌సాగుతున్న స‌మయంలోనే ఇది జరిగింద‌ని విస్మయం వ్యక్తం చేశారు. ఇలా చేయ‌డంవ‌ల్ల‌ చైనా సైన్యం త‌ప్పుడు సంకేతాల‌ను పంపిస్తున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ ఐదుగురి పేర్ల‌ను కూడా వెల్ల‌డించారు.
 మరోవంక, దారి త‌ప్పిన ముగ్గురు చైనా పౌరుల‌ను భార‌త సైన్యం ర‌క్షించింది. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర సిక్కిం పీఠ‌భూమి ప్రాంతంలో 17,500 అడుగుల ఎత్తులో గ‌డిచిన గురువారం చోటుచేసుకుంది. ర‌క్షించ‌బ‌డిన చైనా ద‌ళాల సిబ్బందికి ఆక్సిజ‌న్, ఆహారం, వెచ్చ‌ని దుస్తువుల‌ను భార‌త సైన్యం అంద‌జేసింది. 
 
అదేవిధంగా వారు సుర‌క్షితంగా త‌మ గ‌మ్య‌స్థానానికి చేరుకునేందుకు రూట్ మ్యాప్‌ను తెలిపింది. ఇండియ‌న్ ఆర్మీకి సంబంధించినంత వ‌ర‌కు మాన‌వత్వ‌మే త‌మ‌కు మొద‌టి ప్రాధాన్య‌త అని ఆర్మీ పేర్కొంది.