
ఒడిశాలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భరోసా వ్యక్తం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒడిశా రాష్ర్ట కార్యనిర్వాహక సమావేశంలో ప్రసంగీస్తూ ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు.
2014 విధానసభలో బీజేపీకి 18 శాతం ఓట్లు వచ్చాయని, 2019 లో అది 32 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఓట్లను తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఒడిశాలో బీజేపీ కార్యకలాపాలను విన్న జేపీ నడ్డా సంతోషం వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఒక కోటి ఓట్లు రావడం సంతోషకరమని చెప్పారు. షెడ్యూల్డ్ తెగలలో, షెడ్యూల్డ్ కులాల్లో ప్రభావాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ వర్గాలకు 33 సీట్ల కేటాయింపు ఉందని పేర్కొన్నారు.
గత కొన్ని నెలలుగా బీజేపీ కార్యకర్తలు ఒడిశాలో దాదాపు 7 లక్షల రేషన్ కిట్లు, 60 వేల శానిటైజర్లు, 5.5 లక్షల మాస్కులు, ఆహార పొట్లాలు అందజేయడంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలను చేస్తున్నారని చెబుతూ వారిని అభినందించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయకపోవడం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఒడిశాలో రూ .5 లక్షల వైద్య ప్రయోజనం పొందగలవారు 2.4 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేదలకు చేరేందుకు అనుమతించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కోరారు.
చికిత్స నిమిత్తం ఒడిశా ప్రజలకు ఢిల్లీకి వస్తుంటారని చెబుతూ అటువంటి ఇబ్బందులను తొలగిస్తూ మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజపేయి, ప్రధాని నరేంద్రమోదీ చర్యలు చేపట్టారని వివరించారు. ఎయిమ్స్ భువనేశ్వర్‌లోనే ఒడిశా ప్రజలు ఇప్పుడు చికిత్సను పొందవచ్చని చెప్పారు. బీజేపీ కార్యకర్తలందరూ ప్రజల వద్దకు వెళ్లి ప్రతిష్టాత్మక నూతన జాతీయ విద్యా విధానం గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు.
More Stories
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
వియత్నాంపై రాహుల్ కు అంత ప్రేమ ఎందుకో?
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేక్ – రీ సర్వేకు ఆదేశం