చైనా నుండి భారత్ కు వచ్చే కంపెనీలకు రాయితీలు   

చైనాకు జపాన్ ఊహించని షాక్ ఇచ్చింది. చైనా నుంచి బయటకు వచ్చే జపాన్ తయారీ సంస్థలు భారత్, బంగ్లాదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయదలిస్తే రాయితీలు ఇస్తామని తెలిపింది. ఈ మేరకు పరిశ్రమలకు రాయితీలు వర్తించే దేశాల జాబితాలో భారత్, బంగ్లాదేశ్‌ను జపాన్ చేర్చింది. 
 
దేశ సరఫరా నెట్‌వర్క్‌ను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరించే లక్ష్యంలో భాగంగా ఈ విధానానికి జపాన్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా చైనా నుంచి ఆసియాన్ దేశాలకు తయారీ పరిశ్రమలను తరలించే కంపెనీలకు రాయితీలు ఇస్తామని జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో 23.5 బిలియన్ యెన్ నిధులను కేటాయించింది. 
 
రాయితీ పథకాన్ని విస్తరించడం వల్ల ఒక దేశం లేదా ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని జపాన్ భావిస్తున్నది. కరోనా వంటి అత్యవసర పరిస్థితులలో కూడా వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్ భాగాల స్థిరమైన సరఫరా కొనసాగే వ్యవస్థను నిర్మించాలని జపాన్ యోచిస్తున్నది.
 
ఇప్పటి వరకు జపాన్ వీటి సరఫరా కోసం చైనాలోని ఆ దేశ కంపెనీలపైనే ఆధారపడింది. అయితే కరోనా నేపథ్యంలో చైనా నుంచి సరఫరాలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలా జరుగకుండా ఒక కార్యాచరణను సిద్ధం చేసింది. 
 
చైనా నుంచి బయటకు వచ్చి భారత్ వంటి ఆసియా దేశాల్లో పరిశ్రమలు నెలకొల్పే జపాన్ కంపెనీలకు రాయితీలు ఇస్తామని ప్రకటించింది. దీంతో భారత్‌లో జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే అవకాశమున్నది. 
 
ప్రామాణికమైన పెట్టుబడిదారుల నుంచి విశ్వసనీయ భాగస్వాములను కలిగి ఉండాలని భారత్, జపాన్ భావిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గత నెలలో తెలిపారు. 
 
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతంలో భాగంగా అసోంలో జపాన్ 13వ పారిశ్రామిక టౌన్‌షిప్ అందుబాటులోకి రానున్నదని ఆ శాఖ అధికారి ఇటీవల పేర్కొన్నారు.