మెట్రో స్టేషన్లలో, రైళ్లలో మాస్క్ తప్పనిసరి  

అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఈ నెల 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి మార్గదర్శకాలను ప్రకటించారు. ప్రయాణికులతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మెట్రో రైలు కార్పొరేషన్లు అనుసరించాల్సిన విధి విధానాలను విడుదల చేశారు. 

ఈ నెల 7 నుంచి 12వ తేదీలోపు అన్ని మార్గాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. ఢిల్లీలో మెట్రో సేవలు మూడు కేటగిరిల్లో ప్రారంభవుతాయని కేంద్రం చెప్పింది. మెట్రో రైలు ఎక్కే ప్రతి ప్రయాణికుడూ ముఖానికి మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని చెప్పింది. 

కంటైన్‌మెంట్‌ జోన్ల వద్ద ఉన్న మెట్రో స్టేషన్లను మూసి ఉంచాలని ఆదేశించింది. స్టేషన్లలో, ప్లాట్‌ఫాంలపైనా, మెట్రో రైళ్లలో భౌతిక దూరం పాటించాలని, అందుకు తగిన విధంగా భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలని సూచించింది. మాస్కులు లేకుండా ఏ ఒక్కరినీ మెట్రో స్టేషన్లలో, రైళ్లలోకి గానీ అనుమతివ్వకూడదని తన మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.

డబ్బులు చెల్లించి తీసుకునేందుకు అన్ని మెట్రో స్టేషన్లలో మాస్కులు అందుబాటులో ఉంచాలని సూచించింది. థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేసి, ఎలాంటి లక్షణాలూ లేని వారినే అనుమతించాలని, ఎంట్రెన్స్‌, ఎగ్జిట్‌ ద్వారాలు, లిఫ్టులు, ఎస్క్‌లేటర్లు సహా అన్ని ప్రదేశాల్లో శానిటైజర్‌ తప్పనిసరిగా అందుబాటులోకి ఉంచాలని తెలిపింది. 

నేరుగా డబ్బు చెల్లించే పద్ధతులు నిలిపివేయాలని.. స్మార్ట్‌కార్డులు, ఆన్‌లైన్‌ బుకింగ్‌కు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. తక్కువ లగేజీతో రావాలని ప్రయాణికులకు సూచించింది. రైళ్లలో ఏసీ సరఫరా, గాలి మారేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపింది. 

ప్రయాణికుల అవగాహన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంది. మెట్రో రైలు కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వం సహా స్థానిక పాలనా సిబ్బంది, పోలీసులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.