కాళేశ్వరం కమీషన్లతో కేసీఆర్ ఫాంహౌస్

ప్రాజెక్ట్ లలో కమీషన్లకు అలవాటు పడ్డ కేసీఆర్ కాళేశ్వరం కమీషన్లతో కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఫాంహౌస్ లు కట్టుకుందని మాజీ ఎంపీ, బిజెపి నేత జి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కేసీఆర్ కు ఫాం హౌస్,  కొడుక్కి ఫాం హౌస్, బిడ్డకు ఫాం హౌస్, అల్లుడికి ఫాం హౌస్, సడ్డకుడి కొడుక్కి ఫామ్ హౌస్..ఇన్ని ఫామ్ హౌస్ లు ఎక్కడివి? అని ప్రశ్నించారు. 

కల్వకుంట్ల ఫ్యామిలీ ఈ ఫామ్ హౌస్ లన్నీ కాళేశ్వరం కమీషన్లతోనే కట్టుకున్నారని చెబుతూ ప్రాజెక్ట్ లను రీ డిజైన్ చేస్తే మరింత కమీషన్ వస్తుందని కేసీఆర్ కు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జగన్ కు మధ్య చీకటి   ఒప్పందం  జరిగిందని ఆరోపించారు. 

ఎన్నికల సమయంలో జగన్ కు కేసీఆర్ సహకరించారని, కొడుకు కేటీఆర్ ను  సీఎంను చేసి, తాను ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఉప ప్రధాని కావాలనుకుంటున్న కేసీఆర్ ఏపీ ఎంపీల అవసరం  ఉంది కాబట్టీ  జగన్ తో ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. 

ఇందులో భాగంగానే పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ లో జగన్ కు కేసీఆర్ సహకరిస్తున్నాడని తెలిపారు వివేక్. వర్షం ద్వారా వచ్చిన నీళ్ళను కూడా కాళేశ్వరం నీళ్ళు అని కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.  సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ లు పెట్టిస్తున్నాడని, డబ్బు తోనే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.