ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని పరిరక్షించాలి 

క్షీణతకు గురవుతున్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి శివలింగం పరిరక్షణకు సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలను జారీ చేసింది.

ఆలయంలోకి ప్రవేశించే భక్తులు శివలింగాన్ని తాకకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే అక్కడ ఉన్న వారు నెలల పాటు రికార్డు చేయాలి. శివలింగాన్ని అభిషేకించేందుకు కోటి తీర్ద్‌ కుండ్‌ నుంచి తీసుకువచ్చే జలాన్ని శుద్ధి చేయాలని ఆదేశించింది.

నీటిలో అవసరమైన పీహెచ్‌ విలువలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. క్షీరాభిషేకం కోసం స్వచ్ఛమైన పాలను వాడాలి. భక్తులు శివలింగానికి పంచామృతాలను సమర్పించటాన్ని నిలిపివేయాలి అంటూ  ఆలయ కమిటీని ఆదేశించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలనిచ్చింది.

ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయం, శివలింగంతో పాటు చంద్రనాగేశ్వర్‌ మందిరం పరిరక్షణ చర్యలను పర్యవేక్షించేందుకు నిపుణుల కమిటీ ఉజ్జయినిలో పర్యటించాలని ఆదేశించింది. ఆ వివరాలకు సంబంధించిన నివేదికను ఈ ఏడాది డిసెంబర్‌ 15లోపు సమర్పించాలని పేర్కొంది.

సుప్రీంకోర్టులో ఆరేండ్లుగా సేవలందించిన జస్టిస్‌ అరుణ్‌మిశ్రా బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తాను విచారణ జరిపిన ఆఖరి కేసు ‘ఉజ్జయిని మహాకాళేశ్వరుడి శివలింగం’ కేసు తీర్పుని ప్రస్తావిస్తూ  ఆ మహాశివుడి దయ వల్ల నేను ఈ చివరి తీర్పు కూడా ఇవ్వగలిగానని సంతోషం వ్యక్తం చేశారు.