దక్షిణ పాంగాంగ్‌పై భారత్ పట్టు!

చైనా దుస్సాహసం నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. దక్షిణ పాంగాంగ్‌ మొత్తాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నది. ఈ ప్రాంతంలో చైనా ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా తిప్పికొట్టేలా సైన్యాన్ని మోహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

వాస్తవాధీన రేఖకు (ఎల్‌ఏసీ) ఆవలి వైపున చైనా తన బలగాలు పెద్ద సంఖ్యలో మోహరిస్తున్న నేపథ్యంలో రక్షణాత్మక ప్రక్రియలో భాగంగానే భారత్‌ ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ‘వ్యూహాత్మక ఎత్తయిన ప్రాంతాల్లో’ పట్టు సాధించడంతో కీలకమైన ‘స్పాంగర్‌ గ్యాప్‌’పై నిఘా పెట్టేందుకు భారత సైనికులకు వీలవుతుంది. 

చైనా సైన్యం మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఒకవైపు కమాండర్లు చర్చలు జరుపుతుండగా, మరోవైపు చైనా బలగాలు సోమవారం కవ్వింపులకు దిగినట్లు తెలిపింది.  భారత్‌ బలగాలు  సమర్థంగా అడ్డుకున్నట్లు పేర్కొంది. 

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం ఇరు దేశాల మధ్య మరోదఫా చర్చలు మొదలయ్యాయి. ఎల్‌ఏసీకి భారత్‌ వైపున ఉన్న చుషుల్‌లో బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. పాంగాంగ్‌ సరస్సు వద్ద పరిస్థితులపైనే ప్రధానంగా చర్చలు సాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సోమవారం 6 గంటలపాటు చర్చలు సాగినా, ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు.

భారత్‌, చైనా మధ్య కచ్చితమైన సరిహద్దులను నిర్ణయించలేదని, అందుకే ఇరుదేశాల మధ్య ఎప్పడూ వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ అన్నారు.  చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

మరోవంక, ఎల్‌ఏసీ వెంబడి తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు, భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అత్యున్నత సమావేశం నిర్వహించారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, సైనికదళాల అధిపతి బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇలా  ఉండగా,లడఖ్‌లో చైనా చొరబాట్ల మధ్య సైన్యాన్ని బలోపేతం చేయడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ పెద్ద ఒప్పందం కుదుర్చుకున్నది. పినాకా రాకెట్ లాంచర్‌ను ఆరు మిలటరీ రెజిమెంట్లకు రూ.2,580 కోట్ల వ్యయంతో కొనుగోలు చేయడానికి రెండు ప్రముఖ దేశీయ రక్షణ సంస్థలతో మంత్రిత్వ శాఖ సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నది. 
 
ఇందుకోసం టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ (టీపీసీఎల్), లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) ను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేశారు.
 
చుషుల్ ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పిఎల్‌ఎ దూకుడు మీద ఉందని భారత అధికార వర్గాలు తెలిపాయి. అయితే భారత బలగాలు కూడా చైనా సైన్యాన్ని దీటుగా ఎదుర్కొంటున్నాయని, ఆయుధాలు, బలగాలలో పిఎల్‌ఎకు ఏమాత్రం తీసిపోని రీతిలో భారత్ మోహరించిందని భారత సైనికాధికారి ఒకరు తెలిపారు. 
 
లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చొరబాటును తిప్పికొట్టేందుకు భారత బలగాలు సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఎల్‌ఎసి వెంబడి ఎత్తైన ప్రాంతాలపై మోహరించిన భారత దళాలు పిఎల్‌ఎ కదలికలపై గట్టి నిఘా వేసి పెట్టాయని ఆయన తెలిపారు.