శశికళ రూ 300 కోట్ల ఆస్తుల జప్తు 

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు చెందిన రూ.300 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ బినామి నిరోధక విభాగం జప్తు చేసినట్టు తెలుస్తున్నది. అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. 

ఆమె మీద అనేక కేసులు విచారణలో ఉన్నాయి. గతంలో శశికళ, కుటుంబం సభ్యుల మీద ఐటీ దాడులు సైతం హోరెత్తాయి. ఇందులో లభించిన ఆధారాల మేరకు 2003–2005లో ఓ సెల్‌ ఫోన్‌ సంస్థ ద్వారా బినామీ పేర్లతో అక్రమాస్తులను శశికళ గడించినట్టు ఆదాయ పన్ను విచారణలో తేలింది. 

చెన్నై శివార్లలో 200 ఎకరాల భూమితోపాటు 65 రకాల ఆస్తులను కొనుగోలు చేసినట్టు వెలుగు చూసినట్టుంది. వాటిని జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.  షెల్ కంపెనీలతో శశికళ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు ఆస్తులను అటాచ్ చేశారు. 

ఇందులో జైలు జీవితం అనంతరం చిన్నమ్మ బస చేయడం కోసం పోయెస్‌ గార్డెన్‌ వేద నిలయంకు ఎదురుగా నిర్మిస్తున్న భవనం స్థలం కూడా ఉండడం గమనార్హం. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.300 కోట్లుగా తేల్చారు. మార్చి 9, 1995న శశికళ ‘శ్రీ హరి చందన ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఓ బినామీ కంపెనీని తెరపైకి తెచ్చినట్టు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేంద్రంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను ఈ కంపెనీ సాగించినట్లు అధికారులు గుర్తించారు. 2003-05 మధ్య కాలంలో శశికళ 200 ఎకరాలను కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ చెప్పుకొచ్చింది. మొత్తం 65 ఆస్తులను శశికళ కూడబెట్టినట్లు తెలిపింది.

 అంతేకాదు, పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.1674 కోట్ల విలువైన స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలతో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ బంధువులకు లేఖ రాసినట్టు ఆదాయపు పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సందర్భంలో శశికళ తన వద్దనున్న కోట్లాది రూపాయల విలువచేసే రూ.500లు, రూ.1000నోట్లను మార్పిడి చేసుకునేలా స్థిరాస్తులు కొనుగోలు చేశారు. అంతే కాకుండా రూ.237 కోట్ల విలువైన ఆ పాత పెద్దనోట్లను పౌష్టికాహార పథకం కాంట్రాక్టరుకు రుణంగా కూడా ఇచ్చారు. ఈ వివరాలను తాము జరిపిన తనిఖీలలో వెల్లడైనట్టు ఆదాయపు పన్నుల శాఖ ప్రకటించింది.