రికార్డు స్థాయిలో పతనమైన జిడిపి 

దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. కరోనా వైరస్ మహమ్మారి  విలయంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలైంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో తొలి త్రైమాసికంలో భారీగా క్షీణతను నమోదు చేసింది.

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం ప్రకటించిన అధికారిక  గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతంగా ఉంది. కరోనా సంక్షోభంతో గత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో నమోదైన 5.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే రికార్డు స్థాయికి క్షీణించింది. 

అంతకుముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.1996లో భారతదేశం త్రైమాసిక గణాంకాలను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుండి ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీ క్షీణించాయని ఎన్ఎస్ఓ విడుదల చేసిన డేటా  తెలిపింది. 

ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం పడిపోయింది. జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగం పనితీరు 3.4 శాతం వృద్ధితో మెరుగ్గా ఉంది. అనుకూలమైన రుతుపవనాలు, నిండిన జలాశయాలలో నీటి లభ్యత, ఖరీఫ్ విత్తనాలు,  పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల  సేకరణ  బలమైన రబీ ఉత్పత్తి వ్యవసాయ వృద్ధికి తోడ్పడినట్లు తెలుస్తోంది.