ముంబై విమానాశ్ర‌యం ఆదాని కైవసం

ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో మెజారిటీ వాటాను హ‌స్త‌గ‌తం చేసుకునేందుకు అదానీ ఎంట‌ర్‌ప్రైజెస లిమిటెడ్ అంగీకారం తెలిపింది. దీంతో ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంతో పాటు న‌వీ ముంబై విమానాశ్ర‌యం అదానీ ఆధీనంలోకి వెళ్ల‌నున్న‌ది. 

జీవీకేతో సోమ‌వారం ఒప్పందం కుదిరిన‌ట్లు అదానీ కంపెనీ వెల్ల‌డించింది. ముంబై విమానాశ్ర‌యంలో 74 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు అదానీ అంగీక‌రించింది. జీవీకేకు చెందిన 50.5 శాతం, ఎయిర్‌పోర్ట్ కంపెనీ ఆఫ్ సౌతాఫ్రికాకు చెందిన 10 శాతం, సౌతాఫ్రిక‌న్ బిడ్‌వెస్ట్‌కు చెందిన 13 శాతం వాటాలను అదానీ కైవ‌సం చేసుకున్న‌ది. 

ముంబై ఎయిర్‌పోర్టులో మ‌రో 26 శాతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది.  న‌వీ ముంబైలో కొత్త‌గా నిర్మించ‌త‌ల‌పెట్టిన విమానాశ్ర‌యం వివ‌రాల‌ను కూడా త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు అదానీ గ్రూప్ తెలియ‌జేసింది.

‌బహుళ వ్యాపార, పారిశ్రామిక దిగ్గజంగా వెలుగొందుతున్న అదానీ గ్రూప్ విమానయాన రంగంలోనూ సత్తా చాటాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే ఇటీవల ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రాజెక్టులనూ గెలుచుకున్నది. లక్నో, జైపూర్‌, గౌహతి, అహ్మదాబాద్‌, తిరువనంతపురం, మంగళూరుల్లో ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులను సొంతం చేసుకున్నది. 

నిజానికి గతేడాది మార్చిలోనే ఏసీఎస్‌ఏ, బిడ్‌వెస్ట్‌ వాటాలను రూ.1,248 కోట్లతో కొనేందుకు అదానీ సిద్ధమైంది. కానీ జీవీకే గ్రూప్‌ అడ్డు తగిలింది. అయితే ఈ వాటా కొనుగోలులో జీవీకే విఫలం కావడంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.

కానీ కరోనా ప్రభావం, ఇతరత్రా ఆర్థిక ఇబ్బందుల మధ్య అదానీ గ్రూప్‌నకే మెజారిటీ వాటాలను అమ్మాలని జీవీకే, ఇతర భాగస్వాములు నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అంతా సజావుగా సాగితే భారతీయ విమానయాన రంగంలో అదానీ ఆధిపత్యం మొదలైనట్లే.  ఇప్పటికే ఓడరేవుల్లో అదానీదే పైచేయి.