ఆరోగ్య సమస్యలతో జపాన్ ప్రధాని సింబా అబే శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పెద్ద పేగులో కణితి ఏర్పడడంతో షింజో అబే ఆరోగ్యం క్షీణించింది.
ఈ క్రమంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. గత మాసం రోజుల నుంచి తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, శారీరకంగా బాగా అలసిపోయినట్టు ఆయన చెప్పారు. తన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చెప్పడంతో ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు.
రాజకీయాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం చాలా ముఖ్యమని,అయితే అనారోగ్యం వల్ల తాను రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైనట్టు ఆయన పేర్కొన్నారు. ఇంత కాలం తనకు సహకరించిన జపాన్ ప్రజలు, ఇతర రాజకీయ ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన పదవీ కాలం పూర్తి చేయలేకపోయినందున ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
జపాన్ ప్రధాని షింజో అబే అనారోగ్యం గురించి తెలిసి ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. ‘మీ ఆనారోగ్యం గురించి తెలిసి బాధ కలిగింది ప్రియ మిత్రమా షింజో అబే’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
‘మీ తెలివైన నాయకత్వం, ఉన్నతమైన వ్యక్తిత్వం వల్లనే భారత్-జపాన్ సంబంధాలు మునుపటి కంటే పటిష్టంగా మారాయి’ అని ప్రధాని ట్విట్టర్‌లో కొనియాడారు. ‘మీరు త్వరగా కోలుకోవాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు.
More Stories
ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్ల వర్షం
సరిహద్దుల్లోకి డ్రాగన్ డ్రోన్లు.. నిఘా కోసమేనా?
వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం