రాజధానిపై  21 నుంచి రోజువారీ విచారణ 

రాజధాని అంశాలపై వచ్చే నెల 21 నుంచి రోజువారీ విచారణ జరిపేందుకు న్యాయవాదులతో ఏపీ హైకోర్టు చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే వీటిపై హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.

రాజధాని అంశాలకు సంబంధించిన పిటిషన్లపై గతంలో ఇచ్చిన స్టేటస్‌ కో అమలు గడువును హైకోర్టు మళ్లీ పొడిగించింది. సెప్టెంబర్‌ 21 వరకూ పొడిగిస్తూ స్టేటస్‌ కో అమలులో ఎటువంటి రాజధాని బిల్లులూ అమలు చేయడానికి వీలులేదని ధర్మాసనం స్పష్టం చేసింది. 

రాజధాని, సిఆర్‌డిఎ రద్దు బిల్లులపై రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు దాఖలు చేసిన 70 పిటిషన్లను హైకోర్టు గురువారం విచారించింది.  కౌంటరు దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబర్‌ 11 వరకు గడువు ఇచ్చింది. వీటిపై అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు 17 వరకు గడువు ఇచ్చింది. 

ఇదిలా ఉండగా విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరుపు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ గెస్ట్‌హౌస్‌ నిర్మించతలపెట్టిందని, స్టేటస్‌ కో అమల్లో ఉన్నప్పుడు గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సబబు కాదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై హైకోర్టు కలగజేసుకొని సెప్టెంబర్‌ 10లోపు కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 21కి వాయిదా వేసింది.