అచ్చెన్నాయుడుకు బెయిల్ 

తెలుగుదేశంపార్టీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ స్కామ్ లో  మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 76 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉంటున్నారు.

పలుమార్లు బెయిల్ కు కోర్టు నిరాకరించింది. కొద్ది రోజుల క్రితం కరోనా పాటిజివ్ రావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో మరోసారి కోర్టు తలుపులు తట్టారు.  దీనిపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థి లోద్ర, హైకోర్టు సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.

మూడు రోజుల క్రితమే వాదనలు జరగగా తీర్పు ఇవాళ ఇస్తామని న్యాయస్థానం పేర్కొంది. కొద్ది సేపటి క్రితమే హైకోర్టు అచ్చెన్నాయుడుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 రూ. 2 లక్షలు షూరిటీ ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దని, సాక్షులను తారుమారు చేయవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది.