సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు   

 కోవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ పార్లమెంట్  వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకూ సమావేశాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

 ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఇరు సభలలో సభ్యులకు స్ధానాలను కేటాయిస్తారు. ఇక లోకసభ సభ్యులందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమవుతారు.  రాజ్యసభ సభ్యులు మాత్రం లోకసభ, రాజ్యసభలో కొలువుతీరుతారు. 

పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ ‘ఆరోగ్య సేతు’ యాప్ కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని నిబంధన విధిస్తారని సమాచారం. సభ్యులకు స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 

అయితే ఆయా సభ్యుల వ్యక్తిగత సిబ్బందికి మాత్రం పార్లమెంట్‌లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనకు అనుగుణంగా కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలోనూ పార్లమెంట్‌ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఇక ఈ ఏడాది మార్చిలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌ 12 బిల్లులను ఆమోదించింది. ఆ సెషన్స్‌లో రెండు సభల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టారు. ఫైనాన్స్‌ బిల్లుతో పాటు బడ్జెట్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇరు సభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనతో సమావేశాలకు అర్థంతరంగా తెరపడింది.