కోవిడ్ ప్రభావం తగ్గిపోతుంది 

ప్రాణాంతక కొవిడ్-19 ఇప్పటికీ విస్తరిస్తున్నప్పటికీ ఆగ్నేయాసియా, తూర్పు మధ్యధరా ప్రాంతాలు మినహా ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాలు తగ్గుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. అయితే  సంస్థ విడుదల చేసిన ఎపిడెమియోలాజికల్ అప్‌డేట్ ప్రకారం అమెరికాలో వైరస్ ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉందని తెలిపింది. 

ప్రపంచవ్యాప్తంగా గతవారం నమోదైన కేసుల్లో సగం, 39,240 మరణాల్లో 62 శాతం నమోదయ్యాయని పేర్కొన్నది. మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 23.65 మిలియన్ మంది కరోనా బారినపడగా, 8,11,895 మంది మరణించారు.  

ఈ నెల 23 ముగిసిన వారానికి ప్రపంచవ్యాప్తంగా 1.7 మిలియన్ కొత్త కేసులు నమోదు కాగా, 39 వేల మరణాలు నమోదైనట్టు తమకు సమాచారం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దీనిని బట్టి గతవారంతో పోలిస్తే కేసుల్లో 4 శాతం, మరణాల్లో 12 శాతం తగ్గుదల కనిపించినట్టు వివరించింది.

కరోనా కేసుల విషయంలో ఆగ్నేయాసియా రెండో స్థానంలో ఉంది. కొత్త కేసుల్లో 28 శాతం, మరణాల్లో 15 శాతం సంభవించాయి. భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతుండగా, నేపాల్‌లోనూ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. 

తూర్పు మధ్యధరా ప్రాంతంలో కేసుల సంఖ్య 4 శాతం పెరిగిందని, అయితే, గత ఆరు వారాలలో మరణించిన వారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. లెబనాన్, ట్యూనీషియా, జోర్డాన్‌లలో గత వారంతో పోలిస్తే కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. 

ఇక, ఆఫ్రికాలో కేసులు, మరణాల సంఖ్య గత వారంతో పోలిస్తే వరుసగా 8శాతం, 11 శాతానికి తగ్గాయి. ముఖ్యంగా అల్జీరియా, కెన్యా, ఘనా, సెనెగల్, దక్షిణాఫ్రికాలలో కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి.