అన్ని రకాల వైరస్‌లను ఎదుర్కొనే టీకా  

అన్ని రకాల వైరస్‌లను ఎదుర్కొనే టీకా  
కరోనాతోపాటు ఆ జాతికి చెందిన అన్ని రకాల వైరస్‌లను ఎదుర్కొనే టీకాను తయారు చేయటానికి కృషి చేస్తున్నామని ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ తెలిపింది. కరోనా జాతికి చెందిన అన్ని రకాల వైరస్‌ల జన్యుక్రమాలను ఉపయోగించి డీఐవోఎస్‌-కోవాక్స్‌2 అనే వ్యాక్సిన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామని, దానిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉన్నదని  వెల్లడించింది. 
 
ట్రయల్స్‌ విజయవంతమైన తర్వాత రోగులకు నొప్పి కలుగకుండా ‘స్ప్రింగ్‌ పవర్డ్‌ జెట్‌ ఇంజిక్షన్‌’ (సూది లేకుండా టీకాను శరీరం లోకి ఎక్కించడం) ద్వారా ఈ టీకాను వేస్తామని తెలిపింది. కొవిడ్‌-19 వైరస్‌ నిర్మాణాన్ని 3డీ కంప్యూటర్‌ మోడలింగ్‌ ద్వారా విశ్లేషించి టీకాను అభివృద్ధి చేశామని
ప్రకటించింది. 
 
`భవిష్యత్‌లో జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశమున్న సార్స్‌, మెర్స్‌ వంటి కరోనా జాతి వైరస్‌ రకాలను కూడా కట్టడి చేసేలా ఈ టీకాను అభివృద్ధి చేశాం. దీని కోసం ఆయా వైరస్‌ జన్యు క్రమాలను కూడా విశ్లేషించాం’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ జోనథాన్‌ హీనే తెలిపారు. 
 
సింథటిక్‌ డీఎన్‌ఏ, 3డీ కంప్యూటింగ్‌ సాంకేతికత సాయంతో అభివృద్ధి చేసిన తమ వ్యాక్సిన్‌ అన్ని రకాల కరోనా వైరస్‌లను కట్టడి చేయగలుగుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త డాక్టర్‌ రెబెకా కిన్స్‌లే తెలిపారు. అత్యంత తక్కువ ధరలోనే టీకాను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.