కిమ్ సోదరి చేతుల్లోకి ఉత్తర కొరియా 

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లడంతో  దేశం యొక్క పగ్గాలను అతడి సోదరి కిమ్ యో జోంగ్ చేతుల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చాంగ్ సాంగ్ మిన్ వెల్లడించారు. కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో ఉండి కోమాలోకి వెళ్లిపోయాడని మిన్ చెప్పారు.

అంతకు మించి కిమ్ బాధపడుతున్న వ్యాధి గురించిగానీ, ఏ దవాఖానలో చేరిందిగానీ ఆయన స్పష్టం చేయలేదు. నెల రోజుల క్రితం కిమ్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, అప్పుడు అకస్మాత్తుగా తెరపైకి వచ్చి అందరి ఊహాగానాలను పటాపంచలు చేశాడు.

ప్రస్తుతం నా వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. “కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో ఉండి కోమాలో వెళ్లాడు. కానీ, సజీవంగానే ఉన్నాడు. ప్రస్తుతం, ఉత్తర కొరియాకు కిమ్ చెల్లెలు కిమ్ యో జోంగ్ నాయకత్వం వహిస్తున్నారు. జోంగ్ అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె పెద్ద సోదరుడు ప్రభుత్వం నడుపుటకు కూడా మద్దతు ఇచ్చారు” అని దక్షిణ కొరియా మీడియాతో సంభాషణ సందర్భంగా మిన్ పేర్కొన్నారు.

కిమ్ తన సోదరి జోంగ్ కు ఇంకా పూర్తిగా అధికారం ఇవ్వలేదని, నాయకత్వ సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగకుండా ఉండటానికి ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించే సూక్ష్మ నైపుణ్యాలను అతను అర్థం చేసుకునేలా ప్రస్తుతానికి  సోదరికి ఈ బాధ్యతలు ఇచ్చారని మిన్ చెప్పారు. 33 ఏళ్ల జోంగ్ కూడా గత నెలలో ప్రభుత్వంలో రెండవ వ్యక్తిగా గుర్తింపుపొందారు. అయినప్పటికీ, కింగ్ ఎప్పుడూ బహిరంగంగా జోంగ్‌ను వారసురాలిగా ప్రకటించలేదు.

పొరుగు దేశమైన ఉత్తర కొరియాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై దక్షిణ కొరియా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. కిమ్ కోమాలో ఉన్నట్లు వార్తలు వచ్చిన వెంటనే దక్షిణ కొరియాలో నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అధికారులు సమావేశమయ్యారు. కిమ్ యో జోంగ్ బాధ్యతలు స్వీకరించిన వార్తల్లో ఆశ్చర్యం లేదని. ఇది రాబోయే కాలంలో కూడా జరగాల్సిందేనని దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్హాప్ తెలిపింది. కొన్ని నివేదికల ప్రకారం.. కిమ్ కు ఏప్రిల్‌ నెలలో గుండె శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి అతడు మరింత అనారోగ్యానికి గురయ్యాడు.

1985 లో జన్మించిన కిమ్ యో జోంగ్.. సోదరుడి కంటే 4 ఏండ్లు చిన్న. తోబుట్టువులు ఇద్దరూ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో చదువుతున్నారు. కొన్ని నెలల క్రితం ఉత్తర-దక్షిణ కొరియా దేశాల మధ్య వివాదం యో జోంగ్‌కు పెద్ద వేదిక ఇవ్వడం ప్రారంభించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.