గణేష్ ఉత్సవాలపై ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలు 

గ్రేటర్ హైదరాబాద్ లో గత నాలుగు దశాబ్దాలుగా ప్రజలు పెద్ద సంఖ్యలో జరుపుకొంటున్న గణేష్ ఉత్సవాలపై ఈ సంవత్సరం కరోనా సాకుతో కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం, నిరంకుశంగా వ్యవహరించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున 
 నిరసన ప్రదర్శనలు జరిగాయి.

విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ల పిలుపు అందుకొని సోమవారం ఉదయం 11 గంటలకు నల్ల జెండాలతో జరిగిన నిరసన ప్రదర్శనలలో బిజెపి కార్యకర్తలు కూడా పాల్గొంటూ ప్రభుత్వ నిరంకుశ ధోరణులను తీవ్రంగా ఖండించారు.

రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ మంటపాల వద్ద పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన నిరసనలతో పాల్గొంటూ నియోజకవర్గం బీజేపీ ఇన్ ఛార్జ్ గజ్జల యోగానంద్ ధ్వజమెత్తారు. ఆలయాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన మంటపాల వద్ద కూడా నిర్బంధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 


హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వేధింపు చర్యలకు దిగడం, నిమజ్జనంకు ఎటువంటి ఏర్పాట్లు చేయదాకా పోవడం పట్ల ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పూసీల చేతులో కీలు బొమ్మగా మారిన కేసీఆర్ హిందూ పండుగల పట్ల చూపుతున్న వివక్షను చరిత్ర క్షమించదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తులు పెద్ద సంఖ్యలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకొంటుంటే ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్బంధ వైఖరిని అవలంభిస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యావహారిస్తున్నదని యోగానంద్ విమర్శించారు. ప్రజలు శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ప్రశాంతంగా గణపతి ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన సూచించారు.