మరోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్నది తర్వాత తెలియజేస్తామని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. 
 
ఈ నెల 5న జరుగవలసిన సమావేశం తొలుత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తనకు వీలు కాదని చెప్పడంతో వాయిదా వేశారు. దీంతో ఈనెల 25న జరిపేందుకు షెడ్యూల్ చేయగా మరోసారి వాయిదా పడింది. 
 
గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నీటి పంపకాలు.. వివాదాలు పరిష్కరించేందుకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ షెడ్యూల్ చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధమయ్యారు.
 అయితే ఊహించని రీతిలో  రెండు రోజుల క్రితం శ్రీశైలం పాతాళగంగ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరగడం, మరో వైపు కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ కు కరోనా సోకడంతో ఆయన కూడా అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడింది.
దీంతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాల్సిన అపెక్స్ కౌన్సిల్ భేటీ పై అనుమానం ఏర్పడింది. ఈ నేపధ్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్నికేంద్ర జలశక్తి శాఖ వాయిదా వేసింది.