ఎన్నికల కమీషన్ కరోనా కోడ్ 

ఎన్నికల ఇంటింటి ప్రచారంలో ఐదుగురే పాల్గొనాలి..పోలింగ్‌ బూత్‌లలో థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేయాలి. ఈవీఎం బటన్‌ నొక్కే ముందు ఓటర్లు గ్లవ్స్‌ ధరించాలి..కోవిడ్‌–19 నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ (ఈసీ) తాజాగా విడుదల చేసిన ఎన్నికల మార్గదర్శకాల్లో ఇవి కొన్ని. 

కేంద్రం విడుదల చేసిన కోవిడ్‌–19 మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల బహిరంగ సభలు, సమావేశాలను రాజకీయ పార్టీలు నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. కోవిడ్‌–19 సమయంలో జరిగే సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వివరించింది. 

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లను ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు. డిపాజిట్లను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఎన్నికల ప్రక్రియ సమయంలో కూడా మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లు, పీపీఈ కిట్ల వాడకం వంటి ప్రామాణిక రక్షణ చర్యలను కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కంటైన్‌మెంట్‌ జోన్లలో నివాసం ఉండే ఓటర్ల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేస్తామని ఈసీ తెలిపింది. ఒకవైపు, కరోనా మహమ్మారి ముప్పు మరింత తీవ్రం కానుందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, ఈసీ నిబంధనలకు లోబడి మొట్టమొదటి ఎన్నికలు బిహార్‌ అసెంబ్లీకి జరిగే అవకాశాలున్నాయి. అయితే, బిహార్‌ ఎన్నికలపై ఈసీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఈసీ జారీ చేసిన మార్గదర్శకాలు

*నామినేషన్‌ దాఖలు, పత్రాల పరిశీలన, గుర్తుల కేటాయింపు వంటివి సజావుగా సాగేందుకు భౌతిక దూరం నిబంధనల ప్రకారం రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌ ఉండాలి. అభ్యర్ధులకు రిటర్నింగ్‌ అధికారి ముందుగానే సమయం కేటాయించాలి.
* నామినేషన్‌ వేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లే అభ్యర్ధి వెంట ఇద్దరు వ్యక్తులు, రెండు వాహనాలు మాత్రమే ఉండాలి.

*ఇంటింటి ప్రచారం సమయంలో భద్రతా సిబ్బంది మినహాయించి అభ్యర్థి సహా ఐదుగురే పాల్గొ నాలి. రోడ్‌షోల్లో పాల్గొనే వాహన కాన్వాయ్‌లో భద్రతా సిబ్బందిని మినహాయిస్తే ఐదు వాహనాలే ఉండాలి.
*కోవిడ్‌–19 మార్గదర్శకాలకు లోబడి బహిరంగ సమావేశాలు, సభలు ఏర్పాటు చేసుకోవాలి.
*జిల్లా ఎన్నికల అధికారి ముందుగా అనుమతించిన చోటే బహిరంగ సభలు జరపాల్సి ఉంటుంది. సభలకు హాజరయ్యే వారు భౌతిక దూరం వంటివి పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఎన్నికల సభలకు హాజరయ్యే వారి సంఖ్య రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్‌డీఎంఏ) పేర్కొన్న పరిమితికి లోబడి ఉండేలా చూడటం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్‌పీ బాధ్యత.
* పోలింగ్‌కు కనీసం ఒక రోజు ముందు పోలింగ్‌ స్టేషన్లను తప్పనిసరిగా పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేయాలి.

*అన్ని పోలింగ్‌ స్టేషన్ల ప్రవేశద్వారం వద్ద థర్మల్‌స్కానర్లు ఏర్పాటు చేయాలి. ఎన్నికల సిబ్బంది కానీ పారామెడికల్‌ సిబ్బంది కానీ పోలింగ్‌ స్టేషన్‌ ప్రవేశ ద్వారం వద్దే ఓటర్లకు థర్మల్‌ స్కానింగ్‌ చేపట్టాలి.

*ఓటర్లందరికీ శరీర ఉష్ణోగ్రతలు గమనించాలి. అనుమానాస్పదంగా ఉంటే రెండు పర్యాయాలు ఉష్ణోగ్రతలు తీసుకోవాలి. ఆరోగ్యశాఖ జారీ చేసిన సురక్షిత స్థాయికి మించి కనిపిస్తే వారికి పోలింగ్‌ ముగిసే చివరి గంటలో ఓటేసేందుకు అవకాశం ఇస్తారు.
* కోవిడ్‌–19 సోకి క్వారంటైన్‌లో గడుపుతున్న వారికి కూడా పోలింగ్‌ ముగిసే ఆఖరి గంటలో అవకాశం కల్పిస్తారు.

* పోలింగ్‌ బూత్‌లో ఓటర్లు ఈవీఎం బటన్‌ నొక్కేముందు వారికి డిస్పోజబుల్‌ గ్లవ్స్‌ అందజేస్తారు.
*పోలింగ్‌ స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న 1,500 మంది ఓటర్లకు బదులు.. వెయ్యి మందికి మించి ఉండరాదు.

*ఎన్నికల ప్రక్రియ సమయంలో కోవిడ్‌–19 సంబంధిత ఏర్పాట్లు, నివారణ చర్యలు వంటివి పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నోడల్‌ అధికారులు ఉంటారు. ఎన్నికల అధికారుల శిక్షణ కూడా ఆన్‌లైన్‌లోనే జరిపే అవకాశం ఉంది.

*ఎన్నికల సిబ్బందిలో కోవిడ్‌–19 లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి బదులుగా మరొకరిని నియమించే ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారులు చూసుకుంటారు.
* ఓట్ల లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చే ముందు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను శానిటైజ్‌ చేయాలి.