అంత బహిరంగంగా మా అంతర్గత విషయాల్లో జోక్యం తగునా అంటూ ఆంధ్రజ్యోతి అధినేత వి రాధాకృష్ణకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చురకలు అంటించారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని ఓ బహిరంగ ప్రకటన ద్వారా ఆయన హితవు పలికారు.
రాధాకృష్ణ ఏం చేసినా, ఎన్ని చేసినా టీడీపీ మంచికే అన్న విషయం అందరికీ తెలుసునని చెబుతూ పత్రికను అడ్డం పెట్టుకుని నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. ఆంద్రజ్యోతిలో ప్రచురించిన “మీ జీవీఎల్, మీ ఇష్టం” విశ్లేషణపై సోము వీర్రాజు ఈ క్రింది విధంగా ఘాటుగా స్పందించారు:
ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశించి “మీ జీవీఎల్, మీ ఇష్టం” అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు.
బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయత్వమే కట్టడి చేయాలనీ సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది.
ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి.
మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా?
అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు.
ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖ.
More Stories
తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిన జగన్
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం