కుటుంబ తప్పిదాలను సమర్ధించుకొనే ప్రయత్నమే సోనియా గ్రంధం!

కాంగ్రెస్‌, నెహ్రూ-గాంధీ కుటుంబం గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చి, వాటిని సమర్థించుకునే ప్రయత్నమే తాజాగా విడుదలైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుస్తకం ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ అని బిజెపి విమర్శలు గుప్పించింది. దీనికి `బిలాంగింగ్’ అని కాకుండా `వైట్‌వాషింగ్’ అని పేరు పెట్టి ఉండాల్సిందని ఎద్దేవా చేసింది. పుస్తకంలో ఎమర్జెన్సీని సమర్థించే ప్రయత్నం చేశారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్‌ కేశవన్‌ ఆరోపించారు.

సోనియా తన పుస్తకంలో బాబ్రీ మసీదు, 1984 సిక్కుల ఊచకోత, బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌, 26/11 ముంబయి ఉగ్రదాడుల గురించి చేసిన ప్రస్తావనలను కేశవన్‌ ప్రశ్నించారు.  బాబ్రీ మసీదు ఘటనపై కన్నీరు పెట్టుకున్నట్లు చెప్పిన సోనియా, 1984లో గురుద్వారాలపై దాడులు, వేలాది మంది అమాయక సిక్కుల హత్యలపై అదే విధంగా స్పందించారా? అని నిలదీశారు.  ఆ ఘటనలు కాంగ్రెస్‌ పాలనలోనే జరిగాయని  ఆయన విమర్శించారు. 

బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల గురించి సోనియా తీవ్రంగా బాధపడినట్లు వచ్చిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది, 26/11 ముంబై దాడుల్లో మరణించిన అమాయకుల గురించి ఆమె అదే స్థాయిలో విచారం వ్యక్తం చేశారా? అని బిజెపి ప్రశ్నించారు. ఆ ఉగ్రదాడుల సమయంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి పుస్తకంలో ఏమి వివరించారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీపై సోనియా రాసిన అంశాలనూ కేశవన్‌ తప్పుబట్టారు. దేశంలో ప్రాథమిక హక్కులను నిలిపివేసి, రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసిన ఆ కాలాన్ని సాధారణమైనదిగా చూపించడం లేదా సమర్థించడం సరికాదని అంటూ మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నెహ్రూ-గాంధీ కుటుంబం నియంత్రణలో 55 ఏళ్లకు పైగా కొనసాగాయని, ఆ పాలన దేశ రాజకీయ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం కలిగించిందని కేశవన్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని వ్యాఖ్యానించారు.

2004లో ప్రధాని పదవిపై మరో వివాదం

సోనియా గాంధీ 2004లో ప్రధానమంత్రి పదవిని స్వీకరించకుండా తప్పుకున్నట్లు చెప్పడంపైనా జేడీయూ ఎంపీ సంజయ్‌ కుమార్‌ ఝా అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్నాలో మాట్లాడిన ఆయన, అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ సోనియాకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించారని ఆయన గుర్తు చేశారు. సంఖ్యాబలం సమకూర్చుకునే ప్రయత్నాలు జరిగాయని, ములాయం మద్దతు నిరాకరించడంతోనే ఆమె ప్రధాని కాలేకపోయారని తనకు తెలిసిన సమాచారం ఆధారంగా ఆయన వ్యాఖ్యానించారు. 

ఇందిరా గాంధీ స్వయంగా ఎమర్జెన్సీ విధించాలని అనుకోలేదని, కొందరి సలహాతో ఆ నిర్ణయం తీసుకున్నారని సోనియా పేర్కొన్నట్లు పత్రికలో చదివానని చెప్పారు. దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి అలాంటి నిర్ణయానికి ఇతరుల సలహాలను కారణంగా చూపడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. న్నారు.

‘ఆ పుస్తకాన్ని ఎవరూ చదవరు’

ఆమె రాసిన విషయాలతో ఎలాంటి మార్పు ఉండదని, ఆ పుస్తకాన్ని ఎవరూ చదవరని  బీజేపీ ఎంపీ రాహుల్‌ సిన్హా విమర్శలు గుప్పించారు.  ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను జైళ్లలో పెట్టిన ఇందిరా గాంధీని సోనియా సమర్థించడం ప్రజలకు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 

రాయ్‌బరేలీలో ఉత్తరప్రదేశ్‌ మంత్రి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ కూడా 2004లో సోనియా ప్రధాని పదవిని వదులుకున్నారన్న వాదనను ప్రశ్నించారు. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం, సోనియా విదేశీ మూలాల కారణంగా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు నిరాకరించారని, ఆ తర్వాత ఆ పరిణామాన్ని ఆమె స్వచ్ఛందంగా ప్రధాని పదవిని వదులుకున్నట్లుగా ప్రచారం చేశారని ఆయన  ఆరోపించారు.

 

 
  

About The Author