ముగ్గురు ఆర్జేడీ ఎమ్యెల్యేలు జేడీయులో చేరిక 

బీహార్‌ శానససభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, లాల్‌ప్రసాద్‌ యాదవ్‌ సొంత పార్టీ రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)కి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, శాసనసభ్యుడు చంద్రికా రాయ్‌తోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఫరాజ్‌ ఫాత్మి, జయవర్ధన్‌ యాదవ్‌ ఆర్జేడీని వీడి నితిశ్‌కుమార్‌ సారథ్యంలోని జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ)లో చేరారు. 

చంద్రికా రాయ్‌ సుదీర్ఘకాలం పాటు ఆర్జేడీ నాయకుడిగా కొనసాగారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన స్వయాన వియంకుడు. లాలు కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు తన కూతురు ఐశ్వర్యరాయ్‌ను ఇచ్చి వివాహం చేశాడు. వీరి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా విడాకుల వరకు వెళ్లింది.

ఇక మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యే సైతం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వారే. ఫరాజ్ ఫాత్మి మాజీ మంత్రి మొహమ్మద్ అలీ అష్రఫ్ ఫాత్మి కుమారుడు. ఈయన 2004 నుంచి 2009 వరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేశారు . సీనియర్ ఫాత్మి సైతం గతేడాది జులైలో జేడీ(యు)లో చేరారు.

జైవర్ధన్ యాదవ్ మాజీ కేంద్ర మంత్రి రామ్ లఖన్ సింగ్ యాదవ్ మనవడు. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనుండగా వరుసగా ముఖ్య నేతలంతా ఆర్జేడీని వీడుతుండడంతో ఆ పార్టీలో కల్లోలం మొదలైంది. గతవారమే మరో ముగ్గురు ఆర్జేడీ ఎమ్యెల్యేలు జేడీయులో చేరారు.